Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 8:01 pm Posted by : ramakrishna

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి

 

. . . గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై డీజీపీ మహేష్ భగవత్ వీడియో కాన్ఫరెన్స్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్ అధికారులను ఆదేశించారు. పుష్కరాల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన భద్రతా చర్యలపై గోదావరి పరివాహక ప్రాంత జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో డీజీపీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఘాట్ల వద్ద భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నిర్వహణ, పార్కింగ్ ఏర్పాట్లు, క్యూలైన్ వ్యవస్థ, అత్యవసర సేవలు, విపత్తు నిర్వహణ, డ్రోన్ నిఘా, సీసీ కెమెరాల పర్యవేక్షణ, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ల పనితీరు వంటి అంశాలపై సమీక్షించారు.

 

Robust security measures must be implemented to ensure devotees do not face any inconvenience.

 

పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని, అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేయాలని డీజీపీ సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఘాట్ వద్ద తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, తప్పిపోయిన వారి కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులకు మార్గదర్శకాలు స్పష్టంగా కనిపించేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్.శుభం ప్రకాష్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు ప్రకాష్ యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ లు శ్రీధర్ రెడ్డి, మల్లేష్, బోధన్ రూరల్ సీఐ విజయబాబు, రెంజల్ ఎస్సై గంగాధర్, నవీపేట్ ఎస్సై శ్రీకాంత్, పోలీస్ కార్యాలయ సూపరింటెండెంట్ శంకర్, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Robust security measures must be implemented to ensure devotees do not face any inconvenience.