Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 7:11 pm Posted by : ramakrishna

నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి

 

. . . డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

 

. . . పాత నేరస్థులపై నిఘా పెంచాలి

 

. . . నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య

 

నిజామాబాద్‌ అర్బన్, బతుకమ్మ :

 

నేరాల నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని నిజామాబాద్‌ డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతి, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై జక్రాన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో పోలీస్‌ కమిషనర్‌ సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిజామాబాద్‌ ఏసీపీ, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఎస్‌ఐలు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు డ్రగ్స్‌, గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక దాడులు కొనసాగించాలని సూచించారు. డ్రగ్స్‌, గంజాయి అక్రమ రవాణా, విక్రయాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సైబర్‌ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఆన్‌లైన్‌ మోసాలకు గురైన బాధితులకు పోలీసులు వెంటనే స్పందించి సహాయం అందించాలని తెలిపారు. సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో నమోదైన హత్య, హత్యాయత్నం, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్‌ మోసాలు, డ్రగ్స్‌, గంజాయి అక్రమ రవాణా, పేకాట, గుట్కా అక్రమ వ్యాపారం తదితర కేసులపై కమిషనర్‌ సమగ్రంగా సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 

Robust measures must be taken to control crime.

 

రౌడీషీటర్లు, పాత నేరస్థులు, బెయిల్‌పై విడుదలైన నిందితుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రాత్రి పహారా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలను కట్టుదిట్టంగా నిర్వహించాలని తెలిపారు. పేకాట, గుట్కా, ఇసుక అక్రమ రవాణా, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిరంతర దాడులు నిర్వహించాలని ఆదేశించారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, షీ టీమ్స్‌, ఈగల్‌ టీమ్స్‌, చీతా ఫోర్స్‌ వంటి ప్రత్యేక బృందాలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని కమిషనర్‌ సూచించారు. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. పోలీస్‌ స్టేషన్లకు వచ్చే ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించి, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. రిసెప్షన్‌ నిర్వహణ, రికార్డుల నిర్వహణ, స్టేషన్‌ పరిశుభ్రత, సిబ్బంది క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు.

 

Robust measures must be taken to control crime.

 

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీస్‌ కమిషనర్‌ సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి బ్లాక్‌ స్పాట్లుగా గుర్తించడంతో పాటు అవసరమైన చోట్ల సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. హైవేలను కలుపుతున్న లింక్‌ రోడ్ల వద్ద అవసరమైన చోట్ల స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయించాలని, రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ఇంజనీరింగ్‌లో లోపాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి నేషనల్‌ హైవే, స్టేట్‌ హైవే అధికారులు, ఇతర సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రతిరోజూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించాలని, ఓవర్‌ స్పీడ్‌, ట్రిపుల్‌ డ్రైవింగ్‌, మైనర్లు వాహనాలు నడపడం వంటి నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించి స్పెషల్‌ డ్రైవ్‌లు చేపట్టాలని తెలిపారు. రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వినియోగించుకునే డయల్‌ 112 సేవలపై విస్తృత ప్రచారం నిర్వహించి, ఈ సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించేలా పోలీసులు నిరంతరం కృషి చేయాలని కమిషనర్‌ ఆదేశించారు. రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని బందోబస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని, వాహనాల తనిఖీలను 24 గంటలూ కొనసాగించాలని తెలిపారు. వాహనాల తనిఖీల సమయంలో సిబ్బంది ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రతి పోలీస్‌ అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో నిజామాబాద్‌ ఏసీపీ ప్రకాష్‌ యాదవ్‌, సీసీఆర్‌బీ ఏసీపీ గురునాయుడు, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌. అంజయ్య, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ రెడ్డి, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఎస్‌ఐలు, ఐటీ కోర్‌ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Robust measures must be taken to control crime.