. . . మోటార్ సైకిలిస్టును దోచుకున్న బీహారి బ్యాచ్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ రూరల్ మండలం కొత్తపేట్ లో బుధవారం అర్ధరాత్రి బీహార్ కు చెందిన ముగ్గురు ముఠా సభ్యులు దారి దోపిడికి పాల్పడ్డారు. కొత్తపేట్ నిజాంసాగర్ కెనాల్ వద్ద నిజామాబాద్ నుంచి వర్ని వైపు వెళ్తున్న మోటార్ సైకిలిస్టులపై దాడులకు పాల్పడి దోచుకున్నారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లికి చెందిన పాంచల్ గితేష్ నిజామాబాద్ నుంచి సొంత గ్రామం వెళ్తుండగా రోడ్డుపై అడ్డుకుని దాడి చేశారు. ఈ దాడిలో గీతేష్ తీవ్రంగా గాయపడ్డాడు.

అతని వద్ద నుంచి సెల్ ఫోన్, కెమెరా, రూ.వెయ్యి నగదు లాక్కున్నారు. అంతకుముందు చింతకుంటకు చెందిన మరో ఇద్దరు మోటార్ సైకిలిస్టులపై దాడులు చేయగా వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తప్పించుకున్నారు. స్థానికంగా రైసుమిల్లులలో హమాలీలుగా పని చేస్తున్న వారే దారి దోపిడికి పాల్పడినట్లు గుర్తించారు. దారి దోపిడికి పాల్పడిన వారిని వదిలేయాలని రైస్ మిల్ యజమాని పైరవీలు చేయడం గమనార్హం. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు బీహార్ కు చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
