బతుకమ్మ: బిచ్కుంద : ఈనెల 14 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం బిచ్కుంద లో ఆయన రోడ్డు భద్రత వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రోడ్డు సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన బాధ్యత కలిగి ఉండాలన్నారు. దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుండగా, ప్రతి మూడు నిమిషాలకు అదే రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడుతున్నారని తెలిపారు. ఎక్కువ శాతం అధిక వేగంతో రోడ్డుపై వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతుందని వాపోయారు. రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్క వ్యక్తి రూల్స్ ను పాటించి ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా వాహనాలను నడపాలని సూచించారు. ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి వాటిపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. అయితే జుక్కల్ నియోజకవర్గం లోని గత ఏడాది 2024 లో మొత్తం సుమారు 30 రోడ్డు ప్రమాదాలు సంభవించగా ఇందులో 10 మందికి పైగా చనిపోయారు. అలాగే సుమారు 15 మంది గాయాల పాలైనట్లు రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు .శ్రీనివాస్ రెడ్డి, సీఐ జగడం నరేష్, ఎస్సై మోహన్ రెడ్డి మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
