భిక్కనూరు, బతుకమ్మ :
వాహనాలను నడిపే ప్రతి ఒక్కరు నియమాలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో శనివారం రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, భద్రతను పెంపొందించడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ మహిళలు తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితులొ మైనర్ లకు వాహనాలు ఇవ్వకూడదని, హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. మద్యం సేవించి, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు ప్రమాదానికి గురైన వ్యక్తిని రహవీర్ పథకం కింద ప్రమాదాలు జరిగిన గంటలోపు బాధితులను సమీప ప్రధాన రహదారి వెంట ఉన్న ఆసుపత్రులకు తరలించి వారికి వారం రోజులపాటు ఉచిత వైద్య చికిత్సలు అందిస్తూ 1,50,000 కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుంది అన్నారు. ప్రమాద సమయంలో భయపడకుండా బాధితులను ఆస్పత్రికి చేర్పించిన వారికి ఈ పథకం కింద 25 వేల ప్రోత్సాహకం ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ సంపత్, ఎస్ఐ ఆంజనేయులు, భిక్కనూరు సర్పంచ్ బల్యాల రేఖ, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఆటో డ్రైవర్ లు, జీపీ వర్కర్ లు, ప్రజలు ఉన్నారు.
