Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 October 2025, 5:16 pm Posted by : ramakrishna

పోలీసుల అదుపులో రియాజ్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ ఆరోటౌన్ పరిధిలో సారంగపూర్ ప్రాంతంలో రియాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఈనెల 17న సీసీఎస్ పోలీసులు రియాజ్ ను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం తరలిస్తుండగా వారిపై కత్తితో దాడి చేసి పరారైన విషయం తెలిసిందే. రియాజ్ దాడిలో గాయపడిన కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఇద్దరు ఎస్ఐలకు కూడా గాయాలపై విషయం తెలిసిందే. అప్పటినుంచి పరారీలో ఉన్న రియాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

  • సారంగపూర్ శివారులో వ్యక్తిపై దాడి చేసిన రియాజ్..

పోలీసులు రియాజ్ కోసం రెండు రోజులుగా తీవ్రంగా గాలిస్తున్నారు. అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.50వేల క్యాష్ రివార్డును ప్రకటించారు. శనివారం రాత్రి నుంచి రియాజ్ కదలికలు నగర శివారులో ఉండటంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం అర్థరాత్రి పోలీసులను తప్పించుకుని రియాజ్ మరోసారి పరారయ్యాడు. అతను ప్రయాణించిన బైక్ ను గుర్తించిన పోలీసులు తెల్లవారుజాము వరకు సోదాలు నిర్వహించారు.

Riyaz in police custody

ఆదివారం ఉదయం సారంగపూర్ సీఆర్పీఎఫ్ ల్యాండ్ ప్రాంతంలో రియాజ్ ఉన్నట్లు గుర్తించి అతన్ని పట్టకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆ క్రమంలో అక్కడ ఉన్న వ్యక్తి పోలీసులకు సహాయం చేసేందుకు రియాజ్ ను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. రియాజ్ అతనిపై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రియాజ్ ను పట్టుకున్నారు. ఈ పెనుగులాటలో రియాజ్ కు కూడా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సీపీ సాయి చైతన్య వెల్లడించారు.

Riyaz in police custody

  • రియాజ్ ఎన్ కౌంటర్ అని జోరుగా ప్రచారం..

కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసి హతమార్చిన రియాజ్ ను ఎన్ కౌంటర్ చేశారని పుకారులు షికారులు చేశాయి. అయితే పోలీసులు ఆ వాదనను ఖండించారు. నగరంలో రియాజ్ ను అదుపులోకి తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరకు పోలీస్ కమిషనర్ రియాజ్ తమ అదుపులోనే ఉన్నాడని ప్రకటనతో ప్రచారానికి తెరపడింది.