Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 April 2025, 11:16 pm Posted by : ramakrishna

మంజీరాలో లక్షలు కొల్లగొడుతున్న ఘనులు

  • నదిలో జేసీబీలు, టిప్పర్లు పెట్టిన ఎమ్మెల్యే అనుచరులు
  • జోరుగా ఇసుక అక్రమ రవాణా
  • రూ.5లక్షల నుంచి రూ.7లక్షల వరకు అక్రమార్జన
  • ట్రాక్టర్ల యజమానులు తహసీల్దార్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు
  • పడిపోతున్న భూగర్భ జలమట్టం.. లబోదిబోమంటున్న రైతులు

 

బోధన్, బతుకమ్మ: మంజీర నదిలో జేసీబీలు, టిప్పర్లు పెట్టి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఇసుక అక్రమ దందా చేస్తున్న ముగ్గురు ఎమ్మెల్యే అనుచరులు కావడమే కారణం. దీంతో ఎమ్మెల్యేకు తన అనుచరుల అభివృద్ధి పై ఉన్న శ్రద్ధ, తనను గెలిపించిన రైతులు,ప్రజలపై లేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నాయకులు నడిచిన బాటలోనే ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు నడుస్తున్నారని అంటున్నారు.

బోధన్ మండలం సిద్ధాపూర్ ఇసుక క్వారీ నుంచి ఇసుకను కాంగ్రెస్ నాయకులు దోచేస్తున్నారు. స్థానిక అవసరాలు, ప్రభుత్వ పనుల కోసమంటూ ఇసుకను హద్దులు దాటిస్తున్నారు. ఇసుక తవ్వకాలు, రవాణా పారదర్శకంగా నడవాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులతో రివ్యూ మీటింగ్ లు పెట్టినప్పటికీ అదే పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతలు ఇసుక దోపిడీని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. టిప్పర్ లలో నింపే ఇసుకను వే బ్రిడ్జీలో తూకం చేయకుండానే రవాణకు అనుమతి ఇస్తున్నారు. భూగర్భ జల వనరుల శాఖ నిబంధనల ప్రకారం టిప్పర్లలో నింపిన ఇసుక వే బ్రి వద్ద తూకం వేయాల్సి ఉంటుంది. కానీ అలాంటిది ఏమీ జరగకుండానే ఇసుక రవాణా జరుగుతోంది. ఒక్కో టిప్పర్ కు రూ.2500 డీడీ రూపంలో ప్రభుత్వ ఖాతాలో డబ్బులు జమచేసి ఇసుక రవాణా చేసుకుంటున్నారు. స్థానికంగా జేసిబీలు, టిప్పర్లలో ఇసుక లోడ్ చేయడానికి ఒక్కో టిప్పర్ కు రూ.6,500 వసూలు చేస్తున్నారు. ఈ విధంగా రోజుకు 100 నుంచి 150 టిప్పర్ల వరకు నడుస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే ఒక్క రోజులో అక్రమార్కులకు సుమారు రూ. 5లక్షల నుంచి 7లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఈ ఆదాయం మొత్తం అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యే ప్రధాన అనుచరుల జేబుల్లోకి వెళ్తున్నట్లు సమాచారం. ప్రతి రోజూ సాయంత్రం కాగానే ఇద్దరు డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాలు మారిన ఇసుక రవాణా మాత్రం మారడం లేదని స్థానిక రైతులు, ప్రజలు మండి పడుతున్నారు. ఆ నాయకులకు ఎమ్మెల్యే సపోర్ట్ మెండుగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులతో రివ్యూ లో ఇసుక రవాణా విషయంలో చాలా స్ట్రిక్ట్ గా విధులు నిర్వర్తించాలని చెప్పి ఇటు తమ పార్టీ నాయకులకు సపోర్టుగా నిలబడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇసుక రవాణా పెరిగిపోయిందని అంటున్నారు.  అందులో ఎమ్మెల్యే అనుచరులు ఉండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మంజీరాలో ఇసుక మాయమవుతుందని, చుట్టు పక్కల ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం పడిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.