Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 8:22 pm Posted by : ramakrishna

తెలంగాణ నుంచి బియ్యం సేకరణ పెంపు

 

. . . కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కిసాన్ మోర్చా ధన్యవాదాలు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

2025 – 26 రబీ సీజన్‌లో తెలంగాణ నుంచి బియ్యం సేకరణ పరిమాణాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ అధ్యక్షులు బస్వపురం లక్ష్మి నరసయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రాష్ట్ర రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి సేకరించాల్సిన బియ్యం పరిమాణాన్ని 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచిందని తెలిపారు. అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు అనుమతి ఇవ్వడం ద్వారా రైతులకు మరింత మద్దతు లభిస్తుందని ఆయనన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిలకు లక్ష్మి నరసయ్య కృతజ్ఞతలు తెలిపారు. జూలై 8 న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కిసాన్ మోర్చా నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ ప్రతినిధులతో కలిసి ఢిల్లీలో ప్రహ్లాద్ జోషిని కలిసి తెలంగాణ రైతుల ప్రయోజనాల దృష్ట్యా బియ్యం సేకరణ పెంచాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. తమ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. బియ్యం సేకరణ పెంపుతో పాటు అదనంగా 12 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలుకు అవకాశం ఏర్పడుతుందని, దీని ద్వారా రాష్ట్ర రైతులకు మరింత లాభం చేకూరుతుందని ఆయన తెలిపారు. ఇదే సమయంలో గత సేకరణ సీజన్‌లకు సంబంధించిన పెండింగ్ బియ్యం నిల్వలను తెలంగాణ ప్రభుత్వం త్వరగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సిఐ) కి అప్పగించాలని లక్ష్మి నరసయ్య కోరారు. రైతుల ప్రయోజనాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ సజావుగా కొనసాగేందుకు ప్రభుత్వం తన బాధ్యతలను పూర్తి చేయాలని సూచించారు. రైతు సంక్షేమమే మా లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

 

Rice procurement from Telangana increased