Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 5:20 pm Posted by : ramakrishna

నిజామాబాద్ నుండి యూ.కేకు బియ్యం ఎగుమతులు

 

. . . లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

భారత్–యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (కాంప్రెహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ – సీఈటీఎ) ద్వారా ఎగుమతులకు లభిస్తున్న అవకాశాలను వినియోగించుకుంటూ నిజామాబాద్‌ నగరంలోని గజానన్ రైస్ మిల్ యాజమాన్యం యునైటెడ్ కింగ్‌డమ్‌కు బియ్యం ఎగుమతులకు అనుమతులు సాధించింది. ఈ మేరకు గజానన్ రైస్ మిల్లు నుండి యూ.కే కు ఎగుమతి అవుతున్న సోనా మసూరి ఎక్స్పోర్ట్ క్వాలిటీ బియ్యం నిల్వలతో కూడిన వాహనాలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సీఈటీఏ అమలుతో భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ల లో మరింత ప్రాధాన్యత లభిస్తోందని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో నాణ్యమైన వరి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన నిజామాబాద్ జిల్లా నుంచి యూకేకు బియ్యం ఎగుమతులు ప్రారంభం కావడం జిల్లాకు గర్వకారణమని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన బియ్యాన్ని ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు జిల్లాకు మంచి గుర్తింపు వస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని దేశాలకు కూడా జిల్లా నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగేలా అధికారులు, ఎగుమతిదారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, గజానన్ రైస్ మిల్ ప్రతినిధి హితేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Rice exports from Nizamabad to the UK