Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 5:27 pm Posted by : ramakrishna

గ్రామ, వార్డు సభల నిర్వహణపై సమీక్ష

 

. . . అధికారులకు దిశానిర్దేశం చేసిన అదనపు కలెక్టర్లు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 4, 6, 8, 10వ తేదీలలో పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభల నిర్వహణకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసిల్దార్లు, ఎం.పీ.ఓలు, వివిధ శాఖల అధికారులకు జిల్లా ఉన్నతాధికారులు గ్రామ, వార్డు సభల నిర్వహణకు సంబంధించి పాటించాల్సిన విధి, విధానాలు, ప్రస్తావించాల్సిన అంశాలు, ప్రజలకు విశదపర్చాల్సిన విషయాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం గురించి అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు దిశానిర్దేశం చేశారు. గ్రామ, వార్డు సభలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ, పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యేలా ప్రణాళికాబద్దంగా కృషి చేయాలని అన్నారు. సభ నిర్వహణకు ఒకరోజు ముందే టాంటాం ద్వారా, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలకు ముందస్తుగానే సమాచారం తెలియజేయాలని తెలిపారు. పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పన కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్) ప్రక్రియ గురించి సభలలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఈ కార్యక్రమానికి సహకరించాల్సిందిగా కోరాలని సూచించారు. ఎస్.ఐ.ఆర్ అమలులో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర క్రియాశీలకం అయినందున రాజకీయ పార్టీలు సత్వరమే బీ.ఎల్.ఏలను నియమించుకుని నిర్దేశిత నమూనాలో జాబితాను సమర్పించేలా ప్రజాప్రతినిధులను కోరాలని అన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులు, విత్తనాలు అందించేందుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈసారి ఎల్ నినో  ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన దరిమిలా పంటల మార్పిడి ఆవశ్యకత గురించి రైతులకు తెలియజేయాలని, వర్షపు నీటి నిలువ, పొదుపుగా సాగు జలాల వినియోగం, అవసరం మేరకే ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకంపై అవగాహన కల్పించాలని హితవు పలికారు. పచ్చదనం పెంపొందించేందుకు మొక్కలు నాటి, వాటిని సంరక్షించాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పాలని, ప్రకృతి సమతుల్యత కోసం అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలని అన్నారు. అనుకోని రీతిలో ప్రకృతి విపత్తులు సంభవించిన సమయాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆపదమిత్ర వాలంటీర్ల సేవలను సద్వినియోగం చేసుకోవడం, ఎవరికైనా విపత్తుల వల్ల నష్టం సంభవిస్తే ఆయా పథకాల ద్వారా ప్రభుత్వాలు అందించే నష్టపరిహారం గురించి సభలలో తెలియజేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, తడి,పొడి చెత్త నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగం నియంత్రణపై ప్రజల్లో అవగాహనను పెంపొందించాలని, వాల్టా, వన్యప్రాణి సంరక్షణ చట్టాల గురించి తెలియజేయాలని సూచించారు.

 

Review of the conduct of village and ward assemblies

 

రక్షిత మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, సానిటేషన్ వంటి వాటి కోసం ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరిస్తూ, వారి నుండి వచ్చే ఫిర్యాదులను సానుకూలంగా స్వీకరిస్తూ యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో ప్రజలు భాగస్వాములయ్యేలా చూడాలని, రహ్ వీర్ వంటి పథకాల గురించి వారికి విశదపర్చాలని అన్నారు. ఆపద్బంధు, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం వంటి వాటిని అర్హులైన వారి సద్వినియోగం చేసుకునేలా ఆయా పథకాల గురించి అర్ధమయ్యే రీతిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న ఇందిరమ్మ ఇళ్ళ పథకం గురించి, రెండవ విడత ఇళ్ళ మంజూరీ ప్రక్రియ గురించి సభలలో వివరించాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ, గ్రామ, వార్డు సభల విజయవంతానికి అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. ఈ సమావేశంలో అదనపు డీ.సీ.పీ శుభం నగ్రాలే, డీ.ఆర్.ఓ గీత, డీ.ఎఫ్.ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్, డీ.ఆర్.డీ.ఓ సాయన్న, జెడ్పీ సీ.ఈ.ఓ సాయగౌడ్, నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్, బోధన్ ఆర్డీఓలు రాజేంద్రకుమార్, విజయలక్ష్మి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

 

Review of the conduct of village and ward assemblies