. . . స్థానిక ప్రజా ప్రతినిధి భూమి కొనుగోలు చేయడం ద్వారానే దర్జాగా రోడ్డు
. . . సాగు నీటి కాలువలను వదలని ప్రజా ప్రతినిధులు
ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండలంలోని తీర్మాన్ పల్లి గ్రామంలోని ధర్పల్లి రోడ్డు లోని హెచ్ పి పెట్రోల్ బంక్ వెనుకాల ప్రభుత్వ కింది కాలువను కబ్జా చేసి దర్జాగా రోడ్డు వేసిన కథనంపై సోమవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసిల్దార్ బాలయ్య సూచనల మేరకు రెవిన్యూ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. రైతులు అందరూ బోర్లు వేసుకోవడంతో సాగునీటి కాలువ నిరుపయోగంగా మారిందని దాంతోనే కాలువను రోడ్డుగా మలుచుకున్నట్లు ప్రాథమికంగా సమాచారం. అలాంటప్పుడు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్న కనీస జ్ఞానం స్థానిక ప్రజాప్రతినిధికి లేకపోవడంపై పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా నూతనంగా గెలుపొందిన స్థానిక ప్రజా ప్రతినిధి సొంత వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతోనే ఆయన అడుగుజాడల్లోనే సాగునీటి కాలువను రూపుమాపి యదెచ్చగా రోడ్డుగా మలుచుకున్నారని అదే గ్రామానికి చెందిన కొందరు ఆరోపిస్తున్నారు. గత కొన్ని దశాబ్దాల నుండి సాగునీటి కాలువగా ఉన్న కాలువను ఉన్నపళంగా రోడ్డుగా మార్చడానికి ప్రభుత్వ అనుమతి ఎందుకు తీసుకోలేదని తాసిల్దార్ బాలయ్య హెచ్చరించారు. బాధ్యులు ఎవరైనా చట్ట పరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధి అయినంత మాత్రాన ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రభుత్వ కాలువను కబ్జా చేయడం సరి కాదని పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందల్వాయి పెద్ద చెరువు నుండి తిరుమల పంటపొలాలను పారిస్తూ వెంగల్పాడు తాండ వద్ద రామడుగు చెరువులోకి వెళ్ళే వాగులో వృధా నీరు పోయేదని వివరించారు. దీంతో పాటు రాంపూర్, లోలం, మల్లాపూర్, గ్రామాలకు లబ్ధి చేకూరేదని వివరించారు. కానీ కేవలం తీర్మాన్ పల్లి గ్రామస్తులకి కింది కాలువ సొంతం అన్నట్లు ప్రజాప్రతినిధిగా ఉండి వ్యవహరించడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే జిల్లా అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బతుకమ్మ దినపత్రికలో 13 జూన్ ప్రచురించిన కథనానికి భారీ స్పందన రావడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అక్రమార్కులు ప్రభుత్వ భూములు కబ్జా చేయడం కాకుండా కనీసం మురికి కాలువలు, సాగునీటి కాలువలను కూడా వదలడం లేదని ఆరోపిస్తున్నారు.