వెబ్ డెస్క్, బతుకమ్మ :
భూ సర్వే నిర్వహించి, రిజిస్ట్రేషన్‌తో పాటు పట్టాదార్ పాస్‌బుక్ జారీకి అవసరమైన నివేదిక అందించేందుకు లంచం తీసుకుంటున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో గురువారం చోటుచేసుకుంది. బీర్పూర్ (వీ & ఎం) తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న మంచికట్ల రాహుల్ ఫిర్యాదుదారుడి భూమికి ఫీల్డ్ సర్వే నిర్వహించి, రిజిస్ట్రేషన్, పట్టాదార్ పాస్‌బుక్ జారీకి అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి తొలుత రూ.50 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఫిర్యాదుదారుడి అభ్యర్థన మేరకు లంచం మొత్తాన్ని రూ.40 వేల కు తగ్గించేందుకు అధికారి అంగీకరించాడు. అందులో రూ.30 వేలను ఆగస్టు 13న, మిగిలిన రూ.10 వేల ను పని పూర్తయిన తర్వాత ఇవ్వాలని ఒప్పందం కుదిరినట్లు ఏసీబీ వెల్లడించింది. ఈ మేరకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.30 వేల లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ కరీంనగర్ యూనిట్ అధికారులు బీర్పూర్‌లోని సిరిపురం కాలనీలో ఉన్న ఫిర్యాదుదారుడి నివాసంలో రాహుల్‌ను పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ.30 వేల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారిక పదవిని దుర్వినియోగం చేస్తూ, విధులను అక్రమంగా నిర్వహించి అనుచిత ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. నిందితుడిని అరెస్టు చేసి కరీంనగర్‌లోని ప్రత్యేక ఎస్పీఈ & ఏసీబీ కేసుల న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు తెలిపింది. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఫిర్యాదుదారుడి భద్రతా కారణాల దృష్ట్యా ఆయన వివరాలను ఏసీబీ వెల్లడించలేదు.