Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 November 2024, 8:19 pm Posted by : ramakrishna

కలెక్టరేట్ లో రెవెన్యూ ఉద్యోగుల నిరసన

నిజామాబాద్, బతుకమ్మ : వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్‌ సహా తహశీల్దార్ ఇతర అధికారులపై దాడిని ఖండిస్తూ నిజామాబాద్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్‌)లో రెవెన్యూ ఉద్యోగులు సోమవారం సాయంత్రం నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్‌ రెడ్డి మాట్లాడుతూ, వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌, తహశీల్దార్‌, ఇతర ఉద్యోగులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విధి నిర్వహణలో భాగంగా గ్రామానికి వెళ్లిన అధికారులపై క్రిమినల్స్ తరహాలో మూకుమ్మడిగా దాడి చేయడం శోచనీయమని ఆక్షేపించారు. ఈ దాడికి పాల్పడిన వాళ్లందర్నీ వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులందరు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవడం ద్వారా తమ నిరసనను కొనసాగించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఇటీవల కాలంలో రెవెన్యూ ఉద్యోగుల పైన దాడులు నిత్యకృత్యంగా మారాయని ఆందోళన వెలిబుచ్చారు. దాడులను అరికడుతూ రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నిరసన కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, కలెక్టర్‌ సీసీ మహేశ్‌, ఆయా విభాగాల పర్యవేక్షకులు శ్రీనివాస్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Revenue employees protest in Collectorate