వెబ్ న్యూస్, బతుకమ్మ : దేశ రాజకీయాల్లో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తీవ్ర నేరాభియోగాలపై అరెస్టయి వరుసగా 30 రోజుల పాటు నిర్భంధంలో ఉన్నట్లయితే రాష్ట్ర మంత్రులు, ముఖ్య మంత్రులు, ప్రధాని మంత్రినైనా 31 వరోజే పదవి నుంచి తప్పించడానికి ఉద్దేశించిన బిల్లు లోకసభలో హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల్లో ఏకంగా 12 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు స్వయంగా ప్రకటించారు. ఈ సంచలన వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 89 కేసులతో అగ్రస్థానంలో ఉన్నారు.
కేసుల సంఖ్యే కాకుండా వాటి తీవ్రత కూడా ఆందోళన కలిగించేది
ఏడీఆర్ నివేదిక ప్రకారం రేవంత్ రెడ్డి తర్వాత తమిళనాడు సీఎం డీఎంకే స్టాలిన్‌పై 47 కేసులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై 19 కేసులు ఉన్నాయని వారి అఫిడవిట్లలో పేర్కొన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై 13, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌పై 5, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ లపై 4 చొప్పున కేసులు నమోదయ్యాయి. కేరళ సీఎం పినరయి విజయన్‌పై 2, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై ఒక క్రిమినల్ కేసు ఉన్నట్టు ఏడీఆర్ స్పష్టం చేసింది. కేవలం కేసుల సంఖ్యే కాకుండా వాటి తీవ్రత కూడా ఆందోళన కలిగించే అంశం. ఈ జాబితాలోని కనీసం 10 మంది ముఖ్యమంత్రులపై హత్యాయత్నం, కిడ్నాపింగ్, అవినీతి వంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయని కూడా ఏడీఆర్ తన నివేదికలో తెలిపింది.