. సొంత పార్టీ నాయకులకే ఆయన పేరు గుర్తుండదు
. ప్రజలు ఆయనను శాశ్వతంగా బహిష్కరిస్తారు
. తెలంగాణను తెచ్చింది కేసీఆర్..
. ఆయనకు పదవులు గడ్డి పోచలతో సమానం
వేల్పూర్, బతుకమ్మ: రేవంత్ రెడ్డికి మానసిక వ్యాధి ఉందని, ఒక పక్క ముఖ్యమంత్రిగా ఆయనను ప్రజలు గుర్తించకపోగా మరో పక్క సొంత పార్టీ నాయకులకే ఆయన పేరు గుర్తుండడం లేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రేవంత్ ప్రస్టేషన్ లో మతి భ్రమించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. 15 ఏళ్లపాటు పోరాడి తెలంగాణను సాధించిన కేసీఆర్ ను ఎందుకు బహిష్కరిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కు పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని, ఆయనను ప్రజలు శాశ్వతంగా బహిష్కరిస్తారన్నారు. సీఎం స్థాయిలో రేవంత్ హుందా గా వ్యవహరించడం లేదని, ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగలాగే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయనపై నమ్మకం లేకే ప్రజలు సర్వేలో పాల్గొనలేదని, పాల్గొన్న వారూ వివరాలు సరిగా ఇవ్వలేదన్నారు. ఆ పార్టీ ప్రజాప్రతినిధులే బీసీ గణనను తప్పుబడుతున్నారని అన్నారు. ఆ సర్వే లెక్కలను కాల్చిపారేయాలని అంటున్నారని, మరో వైపు ఏ ముఖం పెట్టుకుని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని వేముల ప్రశ్నించారు. బీసీ ప్రజలు చైతన్యవంతులయ్యారని, ప్రజలకు క్షమాపణ చెప్పి అడ్డమైన ప్రశ్నలు తీసివేసి మళ్లీ కులఘనన సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇకముందు కేసీఆర్ ,కేటీఆర్, హరీశ్ రావు పై అడ్డమైన కూతలు కూయడం ఆపేయాలని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.