Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 August 2025, 8:37 pm Posted by : ramakrishna

ఖైదీల పరివర్తనతో ఫలితాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్ర కారాగారాన్ని సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుభేదార్ తో కలిసి సందర్శించారు.వారివెంట కేంద్ర కారాగార సూపరింటెండెంట్ చింతల దశరథ్, జైలర్ ఉపేంద్ర ఉన్నారు. కారాగారంలోని మహిళల, పురుషుల బ్యారక్ లను పరిశీలించారు.వసతులు ఎలా ఉన్నాయి అంటు ఖైదీలను అడిగి తెలుసుకున్నారు.భోజన న్యాణ్యతల వివరాలు అడిగారు.కారాగారంలో వసతులు బాగానే ఉన్నాయని, జైలు సిబ్బంది అభిమానపూర్వకంగా ఉండి ఇంటివాతావరణమే ఉన్నదని ఖైదీలు జడ్జి ఉదయ్ భాస్కర్ రావు కు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా బలహీనులైన వారికి న్యాయవాదిని నియమించిన ఉచితంగా న్యాయసేవలు అందిస్తామని తెలిపారు. జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న ఖైదీలు, కోర్టుల ద్వారా శిక్షలకు గురైన ఖైదీలు పరివర్తన తెచ్చుకుని సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని అన్నారు. తెలిసి చేసిన, తెలియక చేసిన నేరం నేరమేనని ఆయన వివరించారు.పరిస్థితుల ప్రభావం, సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా నేరం చేసిన వారు మంచి మార్పుకు అనువుగా మారాలని ఉద్భోదించారు.శిక్షకాలం పూర్తి అయిన ఖైదీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చే స్వయం ఉపాధిని వినియోగించుకుని ఆర్థిక బలవంతులు కావాలని జడ్జి ఉదయ్ భాస్కర్ రావు అన్నారు. చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మాట్లాడుతూ జాతీయ న్యాయసేవప్రాధికారం సంస్థ నాల్సా లీగల్ ఎయిడ్ వ్యవస్థను నిర్మించి న్యాయసేవలు అందిస్తున్నదని తెలిపారు.