Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 March 2025, 9:30 pm Posted by : ramakrishna

అన్ని కులాలకు రిజర్వేషన్లు అందేలా చూడాలి

  • ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ

 

ముప్కాల్, బతుకమ్మ : షమిం అక్తర్ ఇచ్చిన నివేదికలో ఉన్న లోపాలను సవరించి అన్ని కులాలకు రిజర్వేషన్లు అందేలా చూడాలని ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ డిమాండ్ చేశారు.  పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గురువారం ముప్కాల్ మండల కేంద్రంలో దప్పులతో ప్రదర్శన నిర్వహించారు.  ఈ ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంత్రి వర్గంలో మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలన్నారు. ఎస్సీ వర్గీకరణను 3 గ్రూపులుగా కాకుండా ఏబీసీడీ అనే 4 గ్రూపులుగా చెయ్యాలని డిమాండ్ చేశారు. “తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణను స్వాగతిస్తున్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణలో లోపాలు ఉన్నాయని వాటిని సవరించి శాస్త్రీయంగా రిజర్వేషన్లు అన్ని కులాలకు పంచాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ కు తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ జస్టిస్ షమిం అక్తర్ గడువును నెల రోజులు పెంచిందని తెలిపారు. కానీ మాదిగలు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని మంద కృష్ణ మాదిగ గారు ఈ నెల 4 నుంచి 10 వరకు కార్యాచరణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యాచరణను తుచ తప్పకుండా అమలు చెయ్యాలని పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. మాదిగ సమాజం కొంత మంది మాదిగ ద్రోహులను గమనించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మాదిగలను మోసం చేసే పనిలో ఉందని, జస్టిస్ షమిం అక్తర్ మాదిగ, మాదిగ ఉప కులాలకు ఇచ్చిన 9శాతం న్యాయమే  అని మాదిగలకు మోసం చేసే కుట్రకు తెరలేపిందని అన్నారు. దీని కోసం కొంత మంది మాదిగ ద్రోహులను చేరదీసి మాదిగల మహాత్ముడు అయిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ మీద అవాకులు చెవాకులు పేలేలా ఒత్తిడి చేస్తుందని మండిపడ్డారు. దీనిని గమనించి మాదిగలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజులలో రాజకీయ సమాధి కట్టాలని పిలుపునిచ్చారు.ఈ ప్రదర్శనలో ఎంఆర్పీఎస్ ముప్కాల్ మండల అధ్యక్షులు గద్దల జగన్ మాదిగ, బరికుంట సాగర్ మాదిగ, రాజేశ్వర్ మాదిగ, ఉప్పల నరేష్ మాదిగ, దాసరి శేఖర్ మాదిగ, జల్ల సాయన్న మాదిగ, గద్ధాల శేఖర్ మాదిగ,  తదితరులు పాల్గొన్నారు.