Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 May 2025, 12:47 pm Posted by : ramakrishna

విచారణ కోసం వినతులు.. ఆపై ఆందోళనలు

– సీఎస్ సీ హెల్త్ కేర్ పై ‘బతుకమ్మ’లో వచ్చిన కథనంపై చర్చ

– రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గాల్లో చర్చనీయాంశం

– లేబర్ కమిషనరేట్ కార్యాలయంపై మండిపాటు

– ‘బతుకమ్మ’కు బాధితుల ఫోన్ లు

– రిస్ట్రిక్టెడ్ లో రిపోర్టర్ వాట్సాప్

హైదరాబాద్, బతుకమ్మ: భవన నిర్మాణ కార్మికుల నుంచి రక్తం తీసి పరీక్షలు చేయకుండానే సొమ్ము చేసుకుంటున్న సీఎస్ సీ హెల్త్ కేర్ పై ‘బతుకమ్మ’లో వెలువడిన కథనం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంశమైంది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ ఆయా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లులేబర్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చే ఆటోచనలో కార్మిక సంఘాల నాయకులు ఉన్నట్లు తెలిసింది. న్యాయం జరగకపోతే అంతటితో ఆగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు ఆయా జిల్లాల కార్మిక నాయకులు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.

సీఎస్ సీ హెల్త్ కేర్ దోపిడీ

లేబర్ కార్డు ఉన్న వారు రక్త పరీక్షలు చేసుకోవాలనిచేసుకోకపోతే కార్డు పోతుందని భయపెడుతూ దోపిడీ చేస్తున్నారు. కార్మిక శాఖ కమిషనరేట్ కార్యాలయ అధికారులు సహకారం అందిస్తుండడం వల్లే సీఎస్ సీ ఆగడాలకు అంతు లేకుండా పోయిందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కూలీ పనులు చేసుకొని జీవనం సాగించే వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం లేబర్ కార్డులను ప్రవేశపెట్టింది. ప్రమాదవశాత్తు కార్మికులకు ఏదైనా జరిగితే కుటుంబాన్ని ఆదుకునే అవకాశాలు ఉన్నాయి. కూలీల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన లేబర్ కార్డులు ముంబై నుంచి వచ్చిన ప్రైవేట్ సంస్థ సీఎస్ సీ కి కనక వర్షం కురిపిస్తోంది. రక్తం గుంజుడు పథకం మొదలెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ. వందల కోట్ల లాభాలను అర్జించారనే ప్రచారం జరుగుతోంది.

రిపోర్టర్ వాట్సాప్ రిస్ట్రిక్టెడ్

సీఎస్ సీ హెల్త్ కేర్ తో భవన నిర్మాణ కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై ‘బతుకమ్మ’ కథనం వెలువరించింది. తెలంగాణ పరిధిలో ముంబై సంస్థకు అక్రమంగా ఆర్జింపు చేసేలా చేస్తున్న రాష్ట్ర ప్రతినిధులతోపాటు ఇంకొందరు కలిసి వాట్సాప్ ను 24 గంటల పాటు రిస్ట్రిక్టెడ్ (పరిమితి) చేయించారు. రాసిన కథనం ఇతరులకు షేర్ చేయించినప్పటికీకూలీలకు సంబంధించిన విషయం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం వైరల్ చేసింది. వీరి అక్రమాలను అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసేందుకు కార్మిక వర్గం సిద్ధమవుతోందని సమాచారం.

‘బతుకమ్మ’ ప్రతినిధికి బాధితుల ఫోన్ లు

కార్మిక శాఖ అండదండలతో భవన నిర్మాణ కార్మికుల రక్తం తాగుతున్న సీఎస్ సీ సంస్థను అడ్డుకునేందుకు యత్నించి విఫలమైనవారితోపాటు బాధితులు ‘బతుకమ్మ’ ప్రతినిధికి ఫోన్ చేయడం ప్రారంభించారు. మా దగ్గర పూర్తి సమాచారం ఉంది.. దీనిని ‘బతుకమ్మ’ ద్వారా బయటపెట్టాలని వేడుకుంటున్నారు.