నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక, తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవికుమార్ కు బోధన్ పట్టణంలోని విజేత జూనియర్ కళాశాల పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీవీయువి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రామావత్ లాల్ సింగ్, టీజీవిపి జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ గత రెండు రోజుల కిందట బోధన్ లోని విజేత జూనియర్ కళాశాల హాస్టల్లో చదివే విద్యార్థి తప్పిపోయారని, కళాశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల కల్పించాల్సిన సౌకర్యాలను సరిగా కల్పించకపోవడం వలనే విద్యార్థులు హాస్టల్ నుంచి వెళ్ళిపోతున్నారని తెలిపారు. ప్రైవేట్ కళాశాలలో ఫీజులపై ఉన్న శ్రద్ధ హాస్టల్లో ఉన్న విద్యార్థుల భద్రత పైన పెట్టక పోవడం వల్లే విద్యార్థులు హాస్టల్ నుంచి బయటకు వెళుతున్నారన్నారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ కానీ యాజమాన్యం చూడక పోవడంతో ఈ ఘటన జరిగిందన్నారు. గతంలో కూడా ఈ కళాశాల నుంచి ఓ విద్యార్థి తప్పిపోయి ఇప్పటిదాకా దొరకలేదని తెలిపారు. విజేత కళాశాల నుంచి మళ్లీ రెండు రోజుల కిందట ఓ విద్యార్థి తప్పి పోవడంతో విద్యార్థి పేరిట ఒక లెటర్ రాసి వెళ్లిపోయాడని బయటకు ఆ లెటర్ ను రిలీజ్ చేసి విద్యార్థుల తల్లిదండ్రులను విద్యార్థి సంఘాలను మభ్య పెట్టే మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నరని తెలిపారు. యాజమాన్యం తప్పిదం వల్లే ఈ కళాశాల నుంచి విద్యార్థులు బయటికి పోతున్నారని విద్యార్థి తల్లి దండ్రులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు. ఈ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు కనీసం లోపల ఎవరు వస్తున్నారు బయటికి ఎవరు వెళ్తున్నారు అనేది కుడా తెలియకుండా నే వ్యవహరిస్తారని తెలిపారు. విజేత కళాశాల పై చర్యలు తీసుకోవాలని డి.ఐ.ఇ.ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు అఖిల్, వెంకటేష్ పాల్గొన్నారు.