ఏర్గట్ల, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న యూరియా పంపిణీ యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పూర్ణానందం విమర్శించారు. ఎక్కువ శాతం గ్రామాల్లోని రైతులకు స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, ఫోన్లు ఉన్నా వాడటంపై సరైన అవగాహన లేకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో తరచూ సాంకేతిక సమస్యలు రావడం వల్ల రైతులు వ్యవసాయానికి సరిపోయే యూరియాను పొందలేక పోతున్నారని గుర్తు చేశారు. అలాగే ఏర్గట్ల గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, దొంచంద సర్పంచ్ పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి, బట్టాపూర్ సర్పంచ్ ప్రవీణ్ యాదవ్ మాట్లాడుతూ ఒక ఎకరానికి ఒక్క బస్తా యూరియా మాత్రమే ఇవ్వడం, భూమి వివరాలు సరిగ్గా కనిపించక పోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయని, ప్రస్తుతం పొట్ట దశలో ఉన్నటువంటి పొలాలకు యూరియా ను అందించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కావున వ్యవసాయ రైతులు ఇబ్బందులు పడి దిగుబడి రావడంలో నష్టపోయే ప్రమాదం ఉన్నదని అన్నారు. రైతులపై ప్రేమ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా యాప్ ను పూర్తిగా రద్దుచేసి గత ప్రభుత్వంలో మాదిరి పాత పద్ధతిలో రైతులకు యూరియా అందజేయాలని అన్నారు. అలాగే గ్రామాల్లో ని రైతులకు యూరియాను అందుబాటులో ఉంచాలన్నారు. యూరియా అందుబాటులో ఉన్న ప్రాంతాలలో అధికారులు సరిగ్గా స్పందించడం లేదని అన్నారు. కావున రైతులకు సరైన సమాధానం చెప్పే విధంగా చూడాలని, ప్రభుత్వం యూరియా యాప్ ను తీసుకువచ్చి రైతులు సంఘటితం కాకుండా వారి మనోధైర్యాన్ని దెబ్బ తీసే విధంగా ఉన్నదని, ఈ యూరియా యాప్ ను పూర్తిగా రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని బిఆర్ఎస్ మండల పార్టీ తరపున మండల తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ డాక్టర్ మధు, మాజీ సర్పంచ్ లు జక్కుల భూమయ్య, దొంచంద గంగారాం, బట్టపూర్ కటకం సాగర్ రెడ్డి, తడపాకల్ ప్రకాష్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి బద్దం శ్రీనివాస్ రెడ్డి, రోక్కెడ మోహన్, గ్రామ శాఖ అధ్యక్షుడు దేవుడు నరసయ్య, పంతులు రాజేశ్వర్, ముక్కెర దేవన్న యాదవ్, బద్దం ప్రభాకర్, అంజిరెడ్డి, నేరెళ్ల నరేందర్, లక్కం నరసయ్య, అట్ల పోచయ్య, గన్నారపు రాజేశ్వర్, మండల పరిధిలోని గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.