Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 12:38 pm Posted by : ramakrishna

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

. . . జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 

 

భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు.అర్బన్ శాసన సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, పుర ప్రముఖులకు కలెక్టర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు బహూకరించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ, అటవీ, డెయిరీ, పశువైద్య, విద్య, వైద్యం, మహిళా శిశు సంక్షేమం, నీటి పారుదల, మిషన్ భగీరథ, ఫిషరీస్ తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు ఇతర సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును చాటుతూ వ్యవసాయం, హౌసింగ్, డీఆర్డీఏ, ట్రాన్స్ కో, పౌర సరఫరాలు, వైద్యారోగ్య, రాజీవ్ ఆరోగ్యశ్రీ,, 108, 102 అంబులెన్స్ లు, మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్, హెచ్ ఐ వీ ఎయిడ్స్ తదితర శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. 

Republic Day celebrations in full swing

. . . ఉత్సాహభరితంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు

రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశా యి. ఎదనిండా దేశభక్తి భావాన్ని నింపుకుని తమ ప్రదర్శనలతో గణతంత్ర దినోత్సవ వేడుకలకు వన్నెలద్దారు. విస్డమ్ హైస్కూల్ విద్యార్థులు తల్లీ భారతి వందనం గేయంపై, వసుధ హైస్కూల్ చిన్నారులు శంభాజీ మహరాజ్ శౌర్య పరాక్రమం గురించి, విజయ్ హైస్కూల్ పాఠశాలకు చెందిన బాలబాలికలు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాల్సిన ప్రాముఖ్యత గురించి చూడచక్కని నృత్య రీతులను అలవోకగా ప్రదర్శిస్తూ ఔరా అనిపించారు. డిచ్ పల్లి మానవతా సదన్ విద్యార్థిని విద్యార్థులు ఒకే శృతిలో డప్పు వాయిస్తూ తమ కళా నైపుణ్యాన్ని చాటారు.

Republic Day celebrations in full swing

 

బాలబాలికలు అందరూ ఏకరూప దుస్తులు ధరించి తమ అభినయంతో అలరింపజేశారు. జాతీయ సమైక్యతా భావం పెంపొందేలా దేశభక్తి గేయాలు ఆలపిస్తూ నృత్య ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సందర్భంగా చిన్నారులను కలెక్టర్, సీ.పీ తో పాటు ఇతర అతిథులు, జిల్లా ఉన్నతాధికారులు వారి వద్దకు వెళ్లి మెమోంటోలు, ప్రశంసా పత్రాలను బహూకరించి ప్రత్యేకంగా అభినందించారు. స్వయం సహాయక సంఘాలకు స్త్రీనిధి రుణాల చెక్కులు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో డీఆర్డీఓ సాయాగౌడ్, డీపీఓ శ్రీనివాస్ రావు, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు క్యాంపు ఆఫీసులో, జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు.

Republic Day celebrations in full swing

. . . సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.