ఏర్గట్ల, బతుకమ్మ :
రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఏర్గట్ల మండల నాయకులు శుక్రవారం తహసీల్దార్ మల్లయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు తోర్తి గంగారెడ్డి, జిల్లా కార్యదర్శి సంఘం అనిల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ రైతులకు శాపంగా మారిందని విమర్శించారు. ఎన్నికల ముందు రైతులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. యూరియా యాప్ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అవసరమైన సమయంలో ఎరువులు పొందడంలో సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే యూరియా యాప్‌ను రద్దు చేసి, గతంలో అమలులో ఉన్న విధంగా ఎలాంటి యాప్ అవసరం లేకుండా రైతులకు సరిపడా యూరియా ఎరువులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్‌ను పట్టించుకోకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, పార్టీ నాయకులు గుండ విట్టల్, కూరాకుల రమేష్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.