. . . జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర
కామారెడ్డి, బతుకమ్మ :
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర సూచించారు. ఈ సందర్భంగా ఆయన పెద్ద చెరువు, జీఆర్ కాలనీ బ్రిడ్జి సహా వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరిస్థితులను సమీక్షించారు. సంబంధిత అధికారులకు అవసరమైన జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల ప్రాణ రక్షణే పోలీసు శాఖకు ప్రథమ ప్రాధాన్యత అని ఎస్పీ స్పష్టం చేశారు. వాగులు, చెరువులు, కల్వర్టులు, వరద ప్రవాహాల వద్దకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దని హెచ్చరించారు. అలాగే సెల్ఫీలు, వీడియోల కోసం ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని సూచించారు. తల్లిదండ్రులు చిన్నారులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అత్యవసర పరిస్థితులు మినహా ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, సుభాష్ రోడ్ చౌరస్తా వద్ద వరద నీటిలో చిక్కుకున్న పెళ్లి బస్సులోని 45 మంది ప్రయాణికులను కామారెడ్డి టౌన్ పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. ఈ సేవలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను లేదా డయల్ 100ను సంప్రదించాలని జిల్లా పోలీసు శాఖ ప్రజలకు సూచించింది.