Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 6:02 pm Posted by : ramakrishna

నిజాంసాగర్ నుంచి సాగునీటి విడుదల

 

. . .  రైతులు పొదుపుగా నీటిని వినియోగించాలి

. . . 1.30 లక్షల ఎకరాల ఆయకట్టు రైతుల పంటలను కాపాడేందుకు చర్యలు.

. . . ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి.

బాన్సువాడ బతుకమ్మ :

 

వానాకాలం పంటల సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ నుంచి బుధవారం సాగునీటిని విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కలిసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. 2026 వర్షాకాలంలో ఎల్‌నినో ప్రభావంతో జూన్, జూలై, ఆగస్టు మూడు నెలల్లో రాష్ట్రంలో సుమారు 36 శాతం వర్షపాతం లోటు నమోదైనప్పటికీ, నిజాంసాగర్ క్యాచ్‌మెంట్ ప్రాంతంలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులో నీటి నిల్వలు పెరిగాయని తెలిపారు. ప్రస్తుతం నిజాంసాగర్‌లో సుమారు 13.3 టీఎంసీల నీరు అందుబాటులో ఉందన్నారు.రాష్ట్రంలోని ప్రాజెక్టుల నీటి నిల్వలపై ప్రభుత్వం నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు నిజాంసాగర్ కింద ఉన్న ఆయకట్టు రైతుల పంటలను కాపాడేందుకు నీటిని సద్వినియోగంగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. చీఫ్ ఇంజనీర్ల కమిటీ, ఇంజనీరింగ్ అధికారుల సిఫార్సుల మేరకు నీటి విడుదలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు.

. . .  1.30 లక్షల ఎకరాలకు సాగునీరు…

నిజాంసాగర్ కింద సుమారు 1.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని పోచారం తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా, ప్రణాళికాబద్ధంగా వినియోగిస్తూ రైతుల పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొదట 15 రోజుల పాటు నీటిని విడుదల చేసి, అనంతరం పరిస్థితిని బట్టి వారం లేదా పది రోజుల విరామం ఇచ్చి, మళ్లీ నీటిని విడుదల చేస్తూ చివరి పంట వరకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

. . .  రైతులు సహకరించాలి

ప్రస్తుతం నాలుగు రోజులుగా ఎండలు తీవ్రంగా ఉన్నాయని, ఎల్‌నినో ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్‌లోనూ వర్షపాతం లోటు ఉండే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు ఉన్నాయని పోచారం పేర్కొన్నారు. అందువల్ల అందుబాటులో ఉన్న నీటిని రైతులు జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు.పై ఆయకట్టు రైతులు అధికంగా నీటిని వినియోగిస్తే కింది ఆయకట్టు రైతులకు నీరు అందక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. కాలువల్లో అధిక క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి వస్తే నిజాంసాగర్ నీటి నిల్వలు త్వరగా తగ్గిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. పై, కింది ఆయకట్టు రైతులు పరస్పరం సహకరించుకుంటూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.బాన్సువాడ, జుక్కల్, బోధన్ నియోజకవర్గాలతో పాటు నిజాంసాగర్ నీటిపై ఆధారపడిన ఆయకట్టు ప్రాంతాల రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పోచారం తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారులు–రైతులు సమన్వయంతో పనిచేస్తే వానాకాలం పంటలను కాపాడుకోవచ్చని ఆయన భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి, కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.