. . . నీటిని విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి
బోధన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్ లో సాగు చేసిన పంట పొలాలకు సాగునీరు అందించాలన్న రైతుల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డిల కృషి ఫలితంగా గుత్పా, అలీ సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అంగీకరించిన విషయం తెల్సిందే. వరి పంట పొట్ట దశలో ఉన్న నేపథ్యంలో 10 రోజులకు ఒక్కసారి విడతల వారీగా సాగునీరు అందించాలని రైతుల విజ్ఞప్తి మేరకు గుత్ప, అలీ సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా నిజాంసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించి అందుకు అవసరమైన ఆదేశాలను అధికారులకు జారీ చేశారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి లు అలీ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలోని నవీపెట్ మండలం కొస్లీ పంప్ హౌజ్ వద్ద నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి బటన్ నొక్కి నీటిని విడుదల చేశారు. నీటి విడుదలతో నవీపెట్, రేంజల్, ఎడపల్లి, నిజామాబాద్ రూరల్ , డిచ్ పల్లి, మాక్లూర్, 6 మండలాల పరిధిలోని సుమారు 53793 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.10 రోజుల పాటు 540 క్యూ సెక్కుల నీటిని విడుదల చేయనున్నారు.దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారులు మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో అన్నదాతలు సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం సాగునీటిని విడుదల చేస్తోందని పేర్కొన్నారు. ఎక్కడ కూడా లీకేజీ సమస్యలు లేకుండా చివరి ఆయకట్టు వరకు నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,రాష్ట్ర గీత పారిశ్రామిక కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, తాహెర్ బిన్ హందాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
