- జిల్లా కేంద్రంలో రిఫైండ్ మాటున మోసం
- బంగారు బిస్కెట్లను తయారు చేస్తున్న రిఫైండర్లు
- దసరా అమ్మకాల్లో వెలుగు చూసిన వైనం
- లోకల్ గా కొనుగోలు చేసి మోసపోయిన ప్రజలు
బతుకమ్మ, నిజామాబాద్ : మహారాష్ట్ర నుంచి జిల్లా కేంద్రంలో తిష్ట వేసిన బంగారం టెస్టింగ్ చేసే వారు కొత్త మోసానికి తెర లేపారు. ఇప్పటికే ఉత్తర తెలంగాణలోని నిర్మల్, బోధన్ ప్రాంతాలలో బంగారు వ్యాపారుల నుంచి బంగారాన్ని కొనుగోలు చేసేందుకు సాధారణ ప్రజలు జంకుతున్నారు. అందుకు కారణం బంగారం టెస్టింగ్ చేస్తామని చెప్పే రిఫైండర్లు. రిఫైండర్లు రిటైర్ల వద్ద తీసుకునే బంగారు నగలను టెస్టింగ్ చేస్తున్నామని చెబుతూనే బిస్కెట్లుగా మలిచి అప్పగిస్తున్నారు. బంగారం కేవలం వ్యాపారుల నుంచి వచ్చిందయితే చాలు అది దొంగ బంగారమా, అర్నమెంట్ లుగా ఉన్నా అందులో కల్తీ ఉన్నా రిఫైండ్ చేసి బిస్కెట్ల రూపంలో అప్పగిస్తున్నామని కొత్త మోసానికి తెర లేపారు. ఇటీవల దసరా పండుగ సందర్భంగా బంగారం ధరకు రెక్కలు వస్తాయని, దసరా పండుగకు బంగారం కొనాలన్న సాంప్రదాయంతో చాలా మంది ప్రజలు జిల్లా కేంద్రంలోని వ్యాపారుల వద్ద బంగారాన్ని కొనుగోలు చేశారు. బంగారు వ్యాపారులు బ్యాంక్ నుంచి తీసుకువచ్చిన బంగారం కాకుండా రిఫైండర్లు ఇచ్చిన బంగారాన్ని ప్రజలకు అమ్మివేశారు. అయితే ఒక నగల వ్యాపారి రిఫైండర్ వద్ద తీసుకున్న బంగారాన్ని వంద గ్రాముల బిస్కెట్ ను 24 క్యారెట్ గా భావించి కొనుగోలు చేయడంతో ఈ వ్యవహరం వెలుగు చూసింది. బంగారాన్ని వేడి చేయగా నలుపుగా కనిపించడంతో అనుమానంతో పరీక్షించగా సాధారణ బంగారం తూకం కంటే రెండు గ్రాముల బంగారం తక్కువగా వచ్చింది. ఈ విషయంపై సదరు నగల తయారిదారు బంగారు వ్యాపారుడిని నిలదీయగా తాను రిఫైండర్ ద్వారా బంగారం బిస్కెట్లు తయారి చేసింది వాస్తవమేనని అంగీకరించాడు. అయితే ఈ విషయంలో ఎవరి నుంచి ఫిర్యాదులు రాలేదని, ముందు దబాయించినా తర్వాత బంగారం టెస్టింగ్ చేసే వారు పౌడర్ కలిపి బిస్కెట్ తయారు చేయడంతో ఈ విధంగా ఉండవచ్చని అనుమానించారు. అందరం కలిసి పోలీసులకు ఫిర్యాదు చేద్దామని ముందుగా సిద్దమైన వ్యవహరం సోమవారం వాయిదా పడింది. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తారనేది సంశయాలు వ్యక్తమౌతున్నాయి. జిల్లా కేంద్రంలో గోల్డ్ టెస్టర్స్ గా రిఫైండర్ గా ఉన్నవారు నిత్యం 5 నుంచి 10 వరకు బిస్కెట్లను తయారు చేసి వ్యాపారులకు ఇస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. స్థానిక వ్యాపారులపై నమ్మకంతో బంగారు బిస్కెట్లు కొన్న వారికి మోసపోయిన విషయం నగలు చేయించుకుంటే కానీ, పరీక్షిస్తే కానీ తెలియని పరిస్థితి ఉంది. ఈ వ్యవహరం చాలా రోజులుగా జరుగుతుందని కొందరు సంఘం ప్రతినిధులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి నగరంలోని వ్యాపారుల వద్ద కొనుగోలు చేసే సామాన్యులే మోసపోయే పరిస్థితి నెలకొంది. బంగారం ధర లక్షా 20 వేల పైచిలుకు పలుకుతుండగా రిఫైండర్లు, గోల్డ్ టెస్టర్లు కుమ్మకై సామాన్యులను మొదలుకుని బంగారు నగలను తయారు చేసే వారిని వంద గ్రాముల బిస్కెట్లో 2 గ్రాముల కోతతో మోసం చేస్తున్నారని బట్టబయలైంది. నగరంలో బంగారం కొనుగోలు చేసే వారు ఒకటికి నాలుగుసార్లు పరీక్షించుకుంటే కానీ రిఫైండర్ల మోసం నుంచి బయటపడే అవకాశం ఉంది.