Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 June 2025, 8:01 pm Posted by : ramakrishna

వరి సాగులో యూరియా వాడకాన్ని తగ్గించాలి

బతుకమ్మ, నాగిరెడ్డిపేట : రైతులు పంటల సాగులో యూరియా వాడకాన్ని తగ్గించి, సాగు ఖర్చులను తగ్గించుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, మాల్ తుమ్మెద ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ అనిల్ రెడ్డి, రేవంత్ లు అన్నారు. గురువారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మండలంలోని పోచారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా అన్నదాతలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు అవసరం మేరకే రసాయనాలను వినియోగించుకొని నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఫర్టిలైజర్ దుకాణాలలో విత్తనాలు, పురుగు మందులను కొనుగోలు చేసిన రశీదులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని సూచించారు. రైతుల ముఖ్యంగా పంట మార్పిడి పాటించి సాగునీటిని ఆదా చేసే పంటలను సాగు చేస్తూ సుస్థిర ఆదాయాన్ని పొందాలని అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు రైతులందరూ ఏపుగా చెట్లను పెంచి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్, హిందుస్థాన్ యూనివర్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ అశోక్, రైతులు పాల్గొన్నారు.