Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 December 2024, 10:13 pm Posted by : ramakrishna

మక్కిపోయిన బియ్యం రీసైక్లింగ్ 

  • ఎల్లారెడ్డి ఎంఎల్ఎస్ పాయింట్ లో మిక్సింగ్ 
  • ఒక్కొక్క లారీకి 4 క్వింటాళ్ళ తూకంలో తేడా 
  • కామారెడ్డి కలెక్టర్ కు,  డీఎంకు ఫిర్యాదు చేసిన రేషన్ డీలర్లు 

కామారెడ్డి, బతుకమ్మ : గత వర్షాకాలంకు సంబంధించిన బియ్యం ముక్కిపోయిన నూకలు, తౌడు కలిగిన బియ్యంను జగిత్యాల, పెద్దపల్లికి తిరిగి  పంపించకుండా ఎంఎల్ఎస్ పాయింట్ లలో రీసైక్లింగ్ చేస్తున్న వ్యవహరం వెలుగులోకి వచ్చింది. దానిపై ఎల్లారెడ్డికి చెందిన రేషన్ డీలర్లు పౌర  సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కు ఫిర్యాదుతో వెలుగు చూసింది. ఆగస్టు మాసంలో కామారెడ్డి జిల్లాకు పెద్దపల్లి, జగిత్యాల జిల్లా నుంచి బియ్యం సరఫరా చేశారు అధికారులు. అందులో ముక్కిపోయినవి, నూకలు తౌడు కలిగి  ఉండగా ఈ విషయం బహిర్గతం కావడంతో సంబంధిత బియ్యాన్ని వెనక్కి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే అప్పటికే సంబంధిత  బియ్యం ఎంఎల్ఎస్ పాయింట్ లకు  చేరడంతో వాటిని వెనక్కి పంపాలని సివిల్ సప్లయ్ బియ్యం, ఎంఎల్ఎస్ పాయింట్ ఇంచార్జిలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే అప్పటికే పది బస్తాల బియ్యాన్నిఎల్లారెడ్డిలోని 79  రేషన్ దుకాణాలకు సరఫరా చేశారు. ఎల్లారెడ్డి ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ఎల్లారెడ్డి, లింగంపేట్, నాగిరెడ్డిపేట్ లలోని రేషన్ దుకాణాలకు సంబంధిత  బియ్యాన్ని పంపించేందుకు ఎంఎల్ఎస్ పాయింట్ ఇంచార్జిలు ప్రయత్నించారు. నవంబర్ మాసంలో జరిగిన ఈ మిస్సింగ్ వ్యవహరం ఫోటోలు, వీడియోలు బహిర్గతమయ్యాయి. ఈ విషయాన్ని ఎల్లారెడ్డి ఎంఎల్ఎస్ పాయింట్ ఇంచార్జిని రేషన్ డీలర్లు నిలదీయగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రేషన్ బియ్యంలో ముక్కిపోయిన బియ్యం కలిపి సరఫరా చేశామని చెప్పడంతో దానిపై ఫిర్యాదు చేశారు. ఎల్లారెడ్డి ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సరఫరా చేసే బియ్యాన్ని ట్రక్ షీట్ ద్వారా తూకం చేయకుండానే పంపిణీ చేస్తున్నారని 79 మంది రేషన్ డీలర్లు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఒక్కొక్క బియ్యం బస్తా ఒక కిలో నుంచి 5 కిలోల వరకు తక్కువగా వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 4న ఎల్లారెడ్డి ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి లింగంపేట్, మొంబాజిపేట్, కొండాపూర్ లకు వచ్చిన బియ్యం లారీలో తూకం చేయగా 1.85 కేజీలు తక్కువగా వచ్చింది.  610 బస్తాలకు గాను 614 బస్తాలు తూకం వేసినట్లు లారీలో 4  సంచులు దించుకున్నారని ఆరోపించారు. డీలర్లకు మాత్రం ట్రక్ షీట్ చూసుకుని లెక్క  చేసుకోవాలని బెదిరిస్తున్నారని దాని వల్ల ఒక్కో లారీకి  సుమారు 3 నుంచి 4 క్వింటాళ్ళ బియ్యం తక్కువగా వస్తున్నాయని తద్వారా డీలర్లకు నష్టం కలుగుతుందని అన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ ఇంచార్జిని ఈ విషయమై వివరణ కోరగా తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నాడని దానిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు.

Recycling of husked rice