Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 7:39 pm Posted by : ramakrishna

పాడి రైతులకు భరోసా

 

. . . విజయ డెయిరీ బలోపేతానికి చర్యలు

 

. . . డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

 

. . . 27 లక్షల మంది విద్యార్థులకు ‘విజయ’ పాలు సరఫరా చేయనున్న ప్రభుత్వం

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

రాష్ట్రంలోని పాడి రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు తెలంగాణ పాడి పరిశ్రమను లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. విజయ డెయిరీని ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు పాల ఉత్పత్తులు పెంచేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు విజయ డెయిరీ నుంచి పాలను సరఫరా చేయాలనే ప్రతిపాదనపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రితో పాటు పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు. రాష్ట్రంలో పాల వినియోగం, పాల సేకరణ, రైతులకు చెల్లించాల్సిన బిల్లులపై అధికారులు, మంత్రులు చర్చించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పాల వినియోగంతో పాటు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు వివిధ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు పాలు అందించే అంశంపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో మొత్తం పాల ఉత్పత్తికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. పాలిచ్చే పశువుల సంఖ్య, వాటి ద్వారా జరుగుతున్న వాస్తవ పాల ఉత్పత్తిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. పాల సేకరణకు సంబంధించి రైతులకు చెల్లించే ధరపై స్పష్టమైన విధానం రూపొందించాలని అన్నారు. రైతుల నుంచి సేకరించిన పాలకు ఎలాంటి బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు చెల్లింపులు జరపాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. పాఠశాలలకు సరఫరా చేసే పాల బిల్లులను సంబంధిత సంక్షేమ శాఖలు నేరుగా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీని వల్ల రైతులకు చెల్లింపుల్లో ఆలస్యం ఉండదని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అనేక కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయని భట్టి విక్రమార్క అన్నారు. రైతులకు సమయానికి డబ్బులు అందితే వారి కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయని, డెయిరీపై నమ్మకం పెరుగుతుందని తెలిపారు. తెలంగాణలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ఆధునిక పద్ధతులను అమలు చేసి పాల ఉత్పత్తులను గణనీయంగా పెంచాలని ఆయన సూచించారు. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను అదనపు జీవనోపాధిగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.

 

Reassurance for dairy farmers