. . . నిజామాబాద్ భరోసా కేంద్రం మొదటి వార్షికోత్సవ వేడుకలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
భరోసా కేంద్రాలు బాధిత పిల్లలకు భద్రతతో పాటు మానసిక స్థైర్యాన్ని కల్పించే వేదికలుగా పనిచేస్తున్నాయని అడిషనల్ డీసీపీ బస్వా రెడ్డి అన్నారు. మంగళవారం నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు వినాయక్‌నగర్‌లోని ఎస్.ఆర్ జూనియర్ కాలేజీలో భరోసా కేంద్రం 1వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ డీసీపీ హాజరయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పోక్సో కేసుల్లో పిల్లలు ఎదుర్కొనే శారీరక (ఫీజికల్), మానసిక (మెంటల్) వేదనలను గుర్తించి వారికి తక్షణ రక్షణ, సహాయం అందించడమే భరోసా కేంద్రాల ప్రధాన లక్ష్యమని వివరించారు. అలాగే పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తూ, పిల్లల హక్కులను కాపాడడమే ఈ చట్టం ఉద్దేశమని తెలిపారు. పిల్లలు తమపై జరుగుతున్న అన్యాయాలను భయంతో దాచుకోకుండా నమ్మకమైన పెద్దలకు తెలియజేయాలని సూచించారు. లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకోవాలని, కష్టపడి చదివి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని విద్యార్థులకు సూచించారు. పిల్లల భద్రతతో పాటు వారి భవిష్యత్తు నిర్మాణం కూడా ముఖ్యమని, ఇందులో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం మొత్తం కలిసినప్పుడే సానుకూల మార్పు సాధ్యమవుతుందని ఆయనన్నారు. ఈ కార్యక్రమం అనంతరం భరోసా కేంద్రం 1వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్టింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీ ఐ. దేవేందర్ రెడ్డి , 4 టౌన్ సీఐ సతీష్ , భరోసా కేంద్ర కోఆర్డినేటర్ రోజా విద్యార్థినిలు పాల్గొన్నారు.
