. . . ఇష్టారాజ్యంగా రీ అలాట్మెంట్ ఆర్డర్స్
. . . సెక్షన్ క్లర్క్ లకే ప్రైవేట్ స్కూల్స్ పర్యవేక్షణ బాధ్యతలు
నిజామాబాద్, బతుకమ్మ :
ఏదైనా ప్రభుత్వ శాఖలో సుదీర్ఘ కాలం పని చేస్తే అక్కడ నియంతృత్వంతో పాటు అవినీతి, అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతుందని యంత్రాంగం బదిలీలు లేదా సెక్షన్ల మార్పిడి చేయడం రీవాజు. అది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాగా జిల్లా అధికారులు పాలన సౌలభ్యం కోసం కూడా తమ వద్ద పని చేసే సిబ్బందిని తాత్కాలికంగా సర్ధుబాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ప్రభుత్వ శాఖలో ప్రధానంగా పేదలకు ఉపయోగపడే విద్య, వైద్య శాఖల్లో ఇటీవల కాలంలో అవినీతి, అక్రమాల ఫిర్యాదులు కొకొల్లలు. పేదలకు ఉచితంగా అందాల్సిన సేవలను అందకుండా చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేదలకు అందించే సమయంలో చేతివాటం కూడా ప్రదర్శించే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ జిల్లాలో తరుచుగా అవినీతి నిరోదక శాఖ (ఏసీబీ) జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖలపై ప్రత్యేక దృష్టి సారించింది. యేడాది కాలంలో అత్యధికంగా విద్యాశాఖలో అవినీతి, ఆరోపణలపై రికార్డుల తనిఖీ చేయడంతో పాటు అధికారుల, సిబ్బంది పనితీరు నివేదికను పాఠశాల విద్యాశాఖ సంచాలకులకు చేరవేసింది.
ఒకే సెక్షన్ లో కొనసాగుతున్న ఉద్యోగులు దీర్ఘకాలంగా ఉండడం వల్ల అవినీతికి దారితీస్తుందని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి గత ఏప్రిల్ 8న డీఈవో కార్యాలయంలో ఉద్యోగుల విభాగాలు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ లో అంతర్భాగంగా ఉన్న డీఈవో కార్యాలయంలో అంతర్గత బదిలీలు జరిగి రెండు నెలలైనా సిబ్బంది కదలకుండా అదే సెక్షన్లో కొనసాగడంపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. ఇటీవల అంతర్గత బదిలీలపై అవినీతి ఆరోపణలు, విమర్శలు రావడంతో అందులో పని చేస్తున్నవారికి రీ అలాట్మెంట్ ఆర్డర్స్ ను జారీ చేశారు.
సెక్షన్ క్లర్క్ లకు ప్రైవేట్ స్కూల్స్ మండలాలు కేటాయించి అవినీతిని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. బోధన్ డిప్యూటీ డీఈవో ఆఫీస్ పూర్తిగా రద్దు చేసి రెండుసార్లు ట్రాన్స్ ఫర్ అయినా తిరిగి డీఈఓ ఆఫీస్ కే సెక్షన్ అలాట్మెంట్ చేసి సొంత నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ ఈవో కార్యాలయం నుంచి నిజామాబాద్ కు బదిలీపై వచ్చిన ఓ జూనియర్ అసిస్టెంట్ కు డిప్యూటీ ఈవో నిజామాబాద్ సెక్షన్ అలాట్ చేయకుండా డీఈఓ ఆఫీసులో పనిచేసే క్లర్క్ కు ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా అసిస్టెంట్ గా ఇచ్చారు. ఆయన కంటే జూనియర్ అయినా జూనియర్ అసిస్టెంట్ కు సెక్షన్ అలాట్ చేస్తూ అతనికి ఒక టైపిస్టును అసిస్టెంట్ గా ఇచ్చారు. అవసరం లేకున్నా ఓ జూనియర్ అసిస్టెంట్ ను ఖలీల్ వాడి స్కూల్ నుండి అదే విధంగా డైట్ నుండి డిప్యుటేషన్ పై తీసుకువచ్చి సెక్షన్లు అలాట్ చేశారు. ఇక్కడ ఉన్న ఓ సీనియర్ అసిస్టెంట్ కు మాత్రం సెక్షన్ ఇవ్వడం లేదు. బోధన్ డిప్యూటీ ఈవో ఆఫీసును పూర్తిగా క్లోజ్ చేసి అక్కడ బదిలీపై వెళ్లిన జూనియర్ అసిస్టెంట్ ను నిజామాబాద్ డిప్యూటీ ఆఫీసులోనే సెక్షన్ అలాట్ చేస్తూ సొంత నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ స్కూల్ కి సంబంధించి అవినీతి జరుగుతుందని రాష్ట్ర కమిషనర్ డైరెక్టర్ ఉత్తర్వుల ప్రకారం ప్రైవేట్ స్కూల్స్ ఓపెనింగ్ పర్మిషన్ అనుమతులపై ఎంఈఓ, డిఇఓలకు ఆన్ లైన్ లాగిన్ ఉంటుంది. కానీ సెక్షన్ క్లర్క్ లకు ఇన్వాల్వ్ చేసి ప్రైవేట్ స్కూల్స్ మండలాల ను కేటాయించడంపై ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. సెక్షన్ల మార్పిడి పరస్పరం ఉండొద్దని నియమ నిబంధన లు ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించి రీ అలాట్ మెంట్ చేయడం విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
