Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 5:20 pm Posted by : ramakrishna

కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ

 

. . . రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్ భవేష్ మిశ్రా

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు అనుసరిస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ చేయడం జరిగిందని కలెక్టర్ భవేష్ మిశ్రా వెల్లడించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీ.సీ హాల్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణను చేపట్టి ముసాయిదా జాబితాను రూపొందించడం జరిగిందన్నారు. జిల్లాలో 1565 పోలింగ్ కేంద్రాలు కొనసాగుతుండగా, హేతుబద్దీకరణ చేసిన మీదట వాటి సంఖ్య 1591 కి చేరిందని తెలిపారు. ఓటర్ల సంఖ్య, ఇతర అంశాలను ప్రాతిపదికగా చేసుకుని 28 పోలింగ్ కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేయాలని, బాన్సువాడ సెగ్మెంట్ పరిధిలోని రెండు పోలింగ్ కేంద్రాలను తొలగించాలని ముసాయిదా జాబితాలో ప్రతిపాదించడం జరిగిందన్నారు. కొత్త పోలింగ్ కేంద్రాలు ప్రతిపాదించిన వాటిలో ఆర్మూర్ నియోజకవర్గం 12, బోధన్ లో 9, బాన్సువాడలో 1, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాలలో 3 చొప్పున ఉన్నాయని కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ అమలు పురోగతి గురించి రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్ వివరిస్తూ, వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, నిజామాబాద్, బాన్సువాడ ఆర్డీఓలు రాజేంద్రకుమార్, రవీందర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Rationalization of polling stations in accordance with the guidelines of the Election Commission of India.