Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 February 2025, 1:59 pm Posted by : ramakrishna

⁠వేడుకగా రథోత్సవం

భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు

కొనసాగుతున్న శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి  బ్రహ్మోత్సవాలు

తిరుపతి, బతుకమ్మ: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజైన మంగ‌ళ‌వారం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వర‌స్వామి ర‌థాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ‌వారి రథాన్ని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. రథస్తుడైన మాధవుడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని అర్చకులు తెలిపారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ మ‌నోహ‌రం, ఈఈ  జ‌గ‌నోహ్మన్ రెడ్డి, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, ఆల‌య అర్చకులు బాలాజీ రంగాచార్యులు తదితరులు, భక్తులు పాల్గొన్నారు.

బుధవారం శ్రీవారికి చక్రస్నానం ..

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన బుధ‌వారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం 9 నుండి 10 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ఉద‌యం 10 గంటలకు ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో చక్రత్తాళ్వార్‌కు శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించనున్నారు.


Rathotsavam as a celebration