Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 September 2025, 8:24 pm Posted by : ramakrishna

కాళోజీ పురస్కారానికి రమాదేవి ఎంపిక హర్షనీయం

  • కవి కంకణాల రాజేశ్వర్

 

భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మకమైన కాళోజీ సాహిత్య పురస్కారానికి  ప్రముఖ కవయిత్రి నెల్లుట్ల రమాదేవిఎంపిక హర్షనీయమని ప్రముఖ కవి, కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, కవి కంకణాల రాజేశ్వర్ అన్నారు. సోమవారం ఆయన బతుకమ్మతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.  ఇందులో భాగంగా ఈ 2025 సంవత్సరానికి గాను బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, కాలమిస్ట్, కార్టూనిస్ట్, వ్యాఖ్యాత, కథకురాలు, ఉపన్యాసకురాలు, విజయ్ విద్యాసంస్థల మెంబర్ నెల్లుట్ల రమాదేవి కాళోజీ సాహితీ పురస్కారాన్ని ఎంపికయ్యారని తెలిపారు. ఈ పురస్కారాన్ని రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు రమాదేవికి అవార్డును బహుకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ రమాదేవి పేరును ఎంపిక చేసిందన్నారు. కాళోజీ నారాయణరావు 111వ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 9న తెలంగాణ భాషా దినోత్సవం లో భాగంగా కాళోజీ అవార్డును నెల్లుట్ల రమాదేవికి ప్రదానం చేయనున్నారన్నారు. రమాదేవిని సత్కరించడంతోపాటు అవార్డు కింద రూపాయలు రూ.1,01,116  నగదు బహుమతిని అందజేయనున్నారని వెల్లడించారు.రమాదేవి స్వస్థలం జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్, తల్లిదండ్రులు శకుంతలా దేవి,  రాంచందర్ రావు. ఈమె ఆంధ్ర బ్యాంకులో పనిచేసి సీనియర్ మేనేజర్ గా ఉద్యోగ విరమణ పొందారు. బాల్యం నుండే సాహిత్యం పై మక్కువతో అనేక రచనలు చేశారు. మనసు భాష, రమనీయం, మనసు మనసుకూ మధ్య, చినుకులు, తల్లి వేరు, అశ్రువర్షం, రమాయణం లాంటి అనేక కవితలు, కథలు, నానీలు రాశారు. “రమ” కలం పేరుతో కార్టూన్లు కూడా వేస్తారన్నారు.సుశీల నారాయణరెడ్డి పురస్కారం, తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారంతో పాటు పలు అవార్డులు, రివార్డులు రమాదేవిని వరించాయని కంకణాల రాజేశ్వర్ అన్నారు. కాళోజీ తొలి మహిళ అవార్డు గ్రహీత రమాదేవి కావడం గమనించదగిన విషయమని, నెల్లుట్ల రమాదేవి సాహిత్య కృషిని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కవి కంకణాల కృతజ్ఞతలు తెలిపారు.