. . . జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి రాకేష్ రెడ్డికి లేదని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నగేష్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ బీజేపీ అధ్యక్షుడు తెలంగాణ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం సమంజసం కాదని పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేసిన రాకేష్ రెడ్డి, ముందుగా ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలో నిలబెట్టి ఓడిస్తామని నగేష్ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆర్మూర్ మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకోలేకపోయిందని, కేవలం ఐదు వార్డులకే పరిమితమైన పార్టీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్‌ను సవాల్ చేయడం తగదని వ్యాఖ్యానించారు. రాకేష్ రెడ్డిపై పోటీకి జిల్లా కాంగ్రెస్ నాయకత్వమే సరిపోతుందని అన్నారు. మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో జిల్లాలోని అన్ని మున్సిపల్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుందని నగేష్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాకు మూడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇంజినీరింగ్ కళాశాల, అగ్రికల్చర్ కళాశాలలను కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని చెప్పారు. జిల్లా అభివృద్ధిపై చర్చకు రాకేష్ రెడ్డి సిద్ధంగా రావాలని ఆయన సవాల్ విసిరారు. అలాగే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, పెట్రోల్-డీజిల్ ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఎన్నికల హామీల అమలుపై రాకేష్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఉద్యోగాలు, ప్రతి కుటుంబానికి రూ.15 లక్షల హామీల అమలుపైనా ప్రశ్నించాలని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఇటీవల భీంగల్‌లో పాఠశాల నిర్మాణానికి 11 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారని నగేష్ రెడ్డి పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని విమర్శించే అర్హత రాకేష్ రెడ్డికి లేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో విమానాశ్రయ ప్రాజెక్టు, వరి-మొక్కజొన్న కొనుగోళ్లు, రైతులకు బకాయిల చెల్లింపులు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక రాకేష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని నగేష్ రెడ్డి ఆరోపించారు. చివరగా, కాంగ్రెస్ నాయకులపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని నగేష్ రెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హాందాన్, డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్, నూడా చైర్మన్ కేశ వేణు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి పాల్గొన్నారు.