Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 7:47 pm Posted by : ramakrishna

రైసుమిల్లులపై దాడులు ఆపాలి

 

. . . 10 శాతం మంది తప్పు చేస్తే అందరిపై బురద జల్లుతున్నారు

 

. . . రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డీ మోహన్ రెడ్డి

 

నిజామాబాద్ , బతుకమ్మ  : 

 

టీఆర్ఎస్ నేతలకు తీహార్ జైలుకు వెళ్లడం అలవాటేనని, తనపై చేసిన తప్పుడు ఆరోపణల్లోనూ క్రిమినల్ కేసులు నమోదు చేసి మళ్లీ అదే జైలుకు వెళ్లడం ఖాయమని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డీ మోహన్ రెడ్డి అన్నారు. గురువారం రైస్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో తనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన టీఆర్ఎస్, బీఆర్ఎస్ నాయకులపై వడ్డీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయంగా తన ఎదుగుదల చూసి ఓర్వలేక బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మోహన్ రెడ్డి ఆరోపించారు. పక్క రాష్ట్రాల వ్యాపారులు ధాన్యం కొనకుండా తాను అడ్డుకుంటున్నానంటూ సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది పూర్తిగా అవాస్తవమని అన్నారు. బియ్యం ధరల పెరుగుదలకు ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణలో సర్కారుకు తమ సహకారం ఉంటుందన్నారు. నేను ఎక్కడ కూడా లారీలను అడ్డుకోవడం లేదని, ఎప్పటికీ నేను రైతుల పక్షపాతినని స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై జిల్లా కలెక్టర్,పోలీస్ కమిషనర్ నిజనిర్ధాణ కమిటీ ఏర్పాటు చేసి నిజాలను నిగ్గు తేల్చాలని మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. దీంట్లో తనపై వస్తున్న ఆరోపణలు నిజమైతే శిరస్సు నరుక్కోవడానికైనా సిద్ధమేనని ఆయన అన్నారు. రైతులకు లాభం జరిగే విధంగా ఎవరైనా ధాన్యం కొనుగోలు చేయవచ్చని సూచించారు. అవినీతి అక్రమాలకు అలవాటుపడ్డ బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు కుట్రపూరితంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై గాంధీ చౌక్ లో బహిరంగ చర్చకు సిద్ధమేనని సవాల్ విసిరారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎప్పటికీ రైతుల వెన్నంటి ఉంటుందని, రైతులు లాభపడేందుకు తమ కృషి ఎల్లవేళలా ఉంటుందన్నారు. రైతులకు ఎక్కడ ధర ఉంటే అక్కడ అమ్ముకునే స్వేచ్ఛ ఉంటుందన్నారు. దీనిని అడ్డుకుంటున్నారనే ఆరోపణలు నిరాధారమైనవని వ్యాఖ్యానించారు. ఈ విలేకరుల సమావేశంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మోటూరి దయానంద్ గుప్తా, లాబిశెట్టి శ్రీనివాస్ తో పాటు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.

Raids on rice mills must stop