Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 May 2025, 12:45 pm Posted by : ramakrishna

కులగణనతోనే ఓబీసీలకు న్యాయమని నమ్మిన వ్యక్తి రాహుల్ గాంధీ

నిజామాబాద్, బతుకమ్మ: కుల గణనతోనే ఓబీసీలకు న్యాయం జరుగుతుందని నమ్మిన వ్యక్తి రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు.

కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. జనగణనలో భాగంగా కుల గణన సైతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అభినందనీయమని అన్నారు.  ఈ ఘనత కులగణన కోసం దేశ ప్రజల పక్షాన ఐదేళ్లపాటు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన రాహుల్ గాంధీకి ఘనత దక్కుతుందన్నారు. కులగణన ప్రక్రియలో అన్ని వర్గాల ఆలోచనలు తీసుకోవడంతోపాటు సబ్ కమిటీ ఏర్పాటు చేసి వేలాది మంది నిర్ణయాలు తీసుకొని కులగణన చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని,అందుకే రాహుల్ గాంధీ తెలంగాణను రోల్ మోడల్ గా తీసుకోవాలని చెప్పారని అన్నారు.

దేశానికే రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, సహచర మంత్రి వర్గానికి కృతజ్ఞతలు తెలుపుతున్నమ్మనారు. బీజేపీ నాయకులు కులగణన అవసరం లేదన్నారని, ఓబీసీల హక్కుల గురించి వారికి జరుగుతున్న అన్యాయాల గురించి తెలియని కేవలం పేరుకే ఓబీసీగా ఉండి గోల్డెన్ స్పూన్ తో పుట్టిన స్థానిక పార్లమెంటు సభ్యులు అరవింద్ ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారని వారు ప్రశ్నించారు.

సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్, సీనియర్ నాయకులు రత్నాకర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ గౌడ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, యాదగిరి, సాయి కిరణ్, శివ తదితరులు పాల్గొన్నారు.