. . . ఒక విద్యార్థి తల పగలగొట్టిన సీనియర్ విద్యార్థులు
. . . తమకు న్యాయం చేయాలని జూనియర్ విద్యార్థుల ఆందోళనలు
భిక్కనూరు, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బి టి ఎస్ ప్రాంతంలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి విద్యార్థులు కామ దహన కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుండగా జూనియర్ విద్యార్థులు నృత్యాలు చేస్తున్న సమయంలో సీనియర్ విద్యార్థులు వచ్చి దాడికి పాల్పడ్డారని ఈ దాడిలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చెందిన రాజు అనే విద్యార్థి తలకు తీవ్ర గాయం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే రోజు రాత్రి దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి గాయపడిన రాజుకు చికిత్సను చేయించామని జూనియర్స్ తెలిపారు. తమపై దాడికి పాల్పడిన సీనియర్ విద్యార్థులను వెంటనే సస్పెండ్ చేయాలని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ క్యాంపస్ ఆవరణలో విద్యార్థులు పెద్ద ఎత్తున రాత్రి నుండి మరుసటి రోజు బుధవారం మధ్యాహ్నం వరకు ఆందోళన చేశారు.

ఈ విషయం తెలుసుకున్న భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు తమ సిబ్బందితో అక్కడి చేరుకొని దాడి ఘటనను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్, ఎస్సై మాట్లాడుతూ విద్యార్థులకు తగిన న్యాయం చేస్తామని ఆందోళన విరమించాలని కోరగా వెంటనే పరిష్కరించాలని అప్పటివరకు ఇలాగే కూర్చుంటామని తేల్చి చెప్పారు.

దీంతో సాయంత్రం అధికారులతో చర్చించి జూనియర్స్ విద్యార్థులపై దాడి చేసిన ఏడుగురు విద్యార్థులను తాత్కాలికంగా హాస్టల్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా భిక్కనూరు దక్షిణ ప్రాంగణంలో ఇటీవల ర్యాగింగ్ పెనుభూతంలా తయారైందని సీనియర్స్ జూనియర్స్ పై ర్యాగింగ్ కు నిత్యం పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెలువడుతున్నాయి.
