. . . క్యాంప్ గ్రామాలలో బరులను గీసిండ్రు
. . . పోటీల నిర్వహణే తరువాయి
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పందెం కోళ్ళు కాళ్లు దువ్వేందుకు సిద్దమయ్యాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా కాళ్ళకు కత్తులు పట్టుకుని పోటీ పడేందుకు పందెం కోళ్ళు రెడీ అయ్యాయి. పందాలను నిర్వహించేందుకు బరులను(వేదికలను) సిద్దం చేశారు. ఉమ్మడి జిల్లాలో సెటిలర్లు ఎక్కువగా నివసించే క్యాంప్ గ్రామాలలో కోడి పందాల నిర్వహణకు సిద్దమైంది. పోలీసు శాఖ కోడి పందాలను నిర్వహించొద్దని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పందాలను నిర్వహించేందుకే నిర్వాహకులు సిద్దమయ్యాయి. ఒకప్పుడు ఆంధ్రా నుంచి ఇక్కడికి వచ్చిన పందెం కోళ్ళ సంస్క`తి క్యాంప్ గ్రామాలను దాటి ఫాంహౌజ్ లను చేరుకుంది. ఆనాడు వలస వచ్చిన ప్రజలే కోళ్ళపై పందాలను కాచేవారు. కానీ ఇప్పుడు ఆర్మూర్ డివిజన్, నిజామాబాద్ రూరల్ డివిజన్ లోని కొన్ని ఫాం హౌజ్ లు అటవీ శివారు ప్రాంతాల్లో కోళ్ళ పందాల నిర్వాహణకు సిద్దమయ్యారు.
నిజామాబాద్ జిల్లాలోని వర్ని పూర్వపు మండలంతో పాటు కోటగిరి పాత మండలం, బోధన్ గ్రామీణ మండలం, ఎడపల్లి, మాక్లూర్, నందిపేట్, డిచ్ పల్లి మండలాల్లో ఒకప్పుడు జోరుగా సంక్రాంతి పండుగ సందర్భంగా కోళ్ళ పందాలు నిర్వహించేవారు. అయితే ఇటీవల కాలంలో సంక్రాంతికి ఆంధ్రాకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా పెరుగడంతో మూడునాలుగు మండలాల్లో గుట్టుచప్పుడు కాకుండా పందాలకు వాట్సాప్ ల ద్వారా ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాతో పాటు పొరుగున ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్, బాన్సువాడ మండలాల్లోని శివారు క్యాంప్ గ్రామాలలో నిర్వాహణకు వాట్సాప్ సందేశాలు వచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా పండుగను రంజుగా నిర్వహించుకునేందుకు గాను గుట్టుచప్పుడు కాకుండా క్యాంప్ గ్రామాలతో పాటు ఫాంహౌజ్ ల్లో ప్రైవేట్ గెస్ట్ హౌజ్ లు వేదికగా మారడం విశేషం.
పోలీసు శాఖ ఆధ్వర్యంలో గతంలో టాస్క్ ఫోర్స్ ద్వారా దాడులు జరిగినా ఘటనలు పందెం కోళ్ళు పోలీస్ స్టేషన్ లలోని సెల్ లలో బంధించిన ఉదంతాలు ఉన్నాయి. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో టాస్క్ ఫోర్స్ లేకపోవడంతో స్థానిక పోలీసులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానికంగా ప్రజాప్రతినిధులతో పాటు గ్రామపెద్దల కనుసన్నుల్లో జరిగే పందెం కోళ్ళతో పాటు ఆయా ప్రాంతాల్లో జూదం జోరుగా జరుగుతుంది. స్థానికంగా లోకల్ పోలీసులు చూసిచూడనట్ల వ్యవహరిస్తుండగా సీసీఎస్ ను వినియోగించి కొన్ని ప్రాంతాల్లో నజర్ వేసిన వారి కళ్ళు గప్పి జూదం, కోళ్ళ పందాలను నిర్వహించేందుకు సిద్దమయ్యారు. పోలీసు శాఖ ఏ మేరకు వాటిని నియంత్రిస్తుందో, అడ్డుకుంటుందో వేచి చూడాలి.