Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 June 2025, 4:08 pm Posted by : ramakrishna

నాణ్యమైన విత్తనం..  రైతన్నకు నేస్తం

మోర్తాడ్,బతుకమ్మ: జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పంట సాగులో నాణ్యమైన విత్తనం యొక్క పాత్రను గుర్తించి, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం “నాణ్యమైన విత్తనం – రైతన్నకు నేస్తం” అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందని కె.వి.కె రుద్రూర్ శాస్త్రవేత్త జయప్రకాష్ అన్నారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని వాడినపుడు దిగుబడులు కనీసం 10-15 శాతం వరకు పెరిగే అవకాశాన్ని రైతులకు తెలియజేయడం. రైతులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధన స్థానం ద్వారా సేకరించి, కొన్ని సాగు సాంకేతికతలను పాటిస్తే అదే విత్తనాన్ని 2-3 సంవత్సరాల వరకు వాడుకోవచ్చని తెలియజేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామంలో ఎంపికైన ముగ్గురు  అభ్యుదయ రైతులకు వ్యవసాయ పరిశోధన స్థానాల ద్వారా ఉత్పత్తి చేసిన నాణ్యమైన విత్తనం అందించబడుతుంది. ఎంపికైన రైతులకు విత్తనోత్పత్తిపై వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు అందించబడతాయని పేర్కొన్నారు. ఈ విధంగా విత్తన సాంకేతికతను గ్రామ స్థాయికి తీసుకెళ్లడం ద్వారా, రానున్న 2-3 సంవత్సరాలలో ప్రతి గ్రామం విత్తన స్వయం సమృద్ధిని సాధించడమే కాక, తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భద్రతలో దేశానికి ఆదర్శంగా నిలిపే లక్ష్యంతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. మోర్తాడ్ మండలంలోని అన్ని గ్రామాల రైతులకు మంగళవారం ప్రతి గ్రామం నుండి ముగ్గురు రైతులకు మూల విత్తనాలు వరి ఆర్ డీ ఆర్ 1200, పెసర ఎం జి జి 347 రకాలను రైతులకు అందజేశారు. కార్యక్రమంలో మోర్తాడ్ మండల వ్యవసాయ అధికారి హరీష్ కుమార్, ఏ ఈ వో శ్రీలత, రంజిత్, మహేష్, లకపతి, రైతులు మహి పాల్, సంతోష్, భూమన్న తదితరులు పాల్గొన్నారు.