. . . 16వ డివిజన్ కార్పొరేటర్ పంచరెడ్డి అనిత
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
16 వ డివిజన్ పరిధిలో జరుగుతున్న సీసీ డ్రెయిన్ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని డివిజన్ కార్పొరేటర్ పంచరెడ్డి అనిత ఆరోపించారు. ఈ మేరకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్‌కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కార్పొరేటర్ అనిత మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న డ్రెయిన్ నిర్మాణ పనుల్లో కాంక్రీట్ మిశ్రమం తయారీలో నిబంధనలకు అనుగుణంగా ఇసుక, సిమెంట్, కంకర వినియోగించడం లేదని ఆరోపించారు. సరిపడా ఇసుకకు బదులుగా కేవలం దుమ్ము వంటి పదార్థాలను ఉపయోగిస్తున్నారని, దీనివల్ల డ్రెయిన్ నిర్మాణం నాణ్యత తగ్గి తక్కువ కాలంలోనే దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు. గతంలో కూడా ఈ అంశంపై ఫిర్యాదు చేసినప్పటికీ, కాంట్రాక్టర్ ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా అదే విధానంలో పనులు కొనసాగిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

నిర్మాణ పనుల నాణ్యతపై కాలనీ వాసులు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను తక్షణమే నిలిపివేసి, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సాంకేతిక తనిఖీలు నిర్వహించాలని కార్పొరేటర్ డిమాండ్ చేశారు. అలాగే నిర్మాణానికి ఉపయోగిస్తున్న మెటీరియల్ నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని కోరారు. పరీక్షల్లో నిబంధనల ఉల్లంఘనలు తేలితే సంబంధిత కాంట్రాక్టర్‌తో పాటు బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రజా నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రభుత్వ ప్రమాణాలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
