Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 July 2025, 4:19 pm Posted by : ramakrishna

నాణ్యమైన విద్యను అందించాలి

  • కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ 

 

కామారెడ్డి, బతుకమ్మ : ఉపాధ్యాయులందరూ సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా, అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్  ఆదేశించారు. జడ్సీహెచ్ఎస్ ఐఎన్సీ కామారెడ్డి పాఠశాలను ఆయన మంగళవారం ఆకస్మిక సందర్శించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో వారు చదువుతున్న విధానం అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో కలిపిస్తున్న మౌళిక వసతులు, అందిస్తున్న విద్య, ఎండీఎం పై విద్యార్థులతో చర్చించారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులందరికీ ప్రతిరోజు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం వడ్డించాలని మధ్యాహ్న భోజనం ఏజెన్సీని ఆదేశించారు. విద్యార్థులందరూ ప్రతిరోజు పాఠశాలకి ఏకరూప దుస్తులలో వచ్చే విధంగా చూడాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాలలో ప్రతి విద్యార్థి ఏక్ పెడ్ మా కె నామ్  అనే కార్యక్రమం కింద ప్రతి ఒక్కరూ అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటాలని ఆ చెట్టును సంరక్షించే బాధ్యత ఆ విద్యార్థి తీసుకోవాలని ఆ చెట్టుకు ప్రతిరోజు నీళ్లు పోసి దాని రక్షణ బాధ్యత ఆ విద్యార్థి పూర్తిగా తీసుకోవాలని సూచించారు. సెలవులో వెళ్లే ఉపాధ్యాయులు ముందస్తుగా ప్రధానోపాధ్యాయుల అనుమతి తీసుకోవాలనన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి, మున్సిపల్ కమిషనర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా ,మండల విద్యాధికారి అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Quality education should be provided.178