Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 8:08 pm Posted by : ramakrishna

పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

 

. . . జిల్లాలో 100.31 శాతం లక్ష్యం సాధించిన వైద్య ఆరోగ్యశాఖ

 

నిజామాబాద్అర్బన్, బతుకమ్మ :

 

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కార్యక్రమం మూడో రోజు బూత్‌ల వద్ద పోలియో చుక్కలు వేయించుకోని ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థినులు, ఎన్‌సీసీ వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు పంపిణీ చేశారు.జిల్లాలో మొత్తం 1,91,883 మంది అర్హులైన చిన్నారులు ఉండగా, తొలి రోజు 1,80,596 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం ద్వారా 94 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు. రెండో రోజు మిగిలిన 11,282 మంది చిన్నారుల్లో 9,264 మందికి పోలియో చుక్కలు అందించి కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేశారు.మూడు రోజుల కార్యక్రమం ముగిసే నాటికి మొత్తం 1,92,470 మంది చిన్నారులకు పోలియో చుక్కలు పంపిణీ చేయడంతో 100.31 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అర్హుల సంఖ్య కంటే ఎక్కువ మంది చిన్నారులకు చుక్కలు వేయడం వలస కుటుంబాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందున సాధ్యమైనట్లు అధికారులు తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని శతశాతం విజయవంతం చేయడంలో కృషి చేసిన వైద్య సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆశా కార్యకర్తలు, ఎన్‌సీసీ వాలంటీర్లు, నర్సింగ్ విద్యార్థినులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అభినందనలు తెలిపారు. ప్రజల సహకారంతో జిల్లాలో పోలియో నిర్మూలన లక్ష్య సాధనలో మరో ముందడుగు పడిందని ఆమె పేర్కొన్నారు.

 

Pulse Polio program successful.