ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని 10 వ వార్డులో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి గతంలో పోలియో టీకాలు వేయించినప్పటికీ పల్స్ పోలియో కార్యక్రమంలో తప్పనిసరిగా రెండు చుక్కలు వేయించాలని తల్లిదండ్రులను కోరారు. దేశం నుంచి పోలియోను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో పల్స్ పోలియో చుక్కలు అందుబాటులో ఉన్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను సమీప అంగన్‌వాడీ కేంద్రాలకు తీసుకెళ్లి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎం అండ్ హెచ్‌ఓ నర్సింగ్ చౌహన్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శరత్, హెచ్‌ఈఓ జనార్దన్ రెడ్డి, సీహెచ్‌ఓ ఠాకూర్, ఏఎన్‌ఎం సుధా, అంగన్‌వాడీ టీచర్ పద్మ, 10వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.