. . . దిష్టి బొమ్మను దగ్దం చేసేందుకు యత్నం
. . . పోలీసులు అడ్డుకోవడంతో నెలకొన్న ఉద్రిక్తత
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలనీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం నగరంలోని ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేసి, బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు నాయకులకు తోపులాట జరిగింది. ప్రభుత్వం పోలీసు వైఖరిపై ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పిఓడబ్ల్యూ, టియుసిఐ జిల్లా ప్రధాన కార్యదర్శులు కే.సంధ్యారాణి, ఎం.సుధాకర్ లు మాట్లాడుతూ బండి సాయి భగీరథ్ ను, బండి సంజయ్ తన పదవిని అడ్డుపెట్టుకొని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. పైగా మైనర్ బాలికనే దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ కొడుకును శిక్ష నుంచి తప్పించడం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారన్నారు. ఫోక్సో కేసు నమోదయి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ నేరస్థుడు అరెస్టు కాకపోవడం దుర్మార్గమన్నారు. సామాన్యులకు ఒక న్యాయం, నాయకులకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. బండి సంజయ్ మీడియాను, సోషల్ మీడియాను, పోలీసులను, చివరకు న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తున్నాడని ఆరోపించారు. వెంటనే బండి సంజయ్ రాజీనామా చేయాలని లేకుంటే, నరేంద్ర మోడీ అతన్ని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాయి భగీరథను అరెస్టు చేసి, మహిళలకు భరోసా ఇవ్వాలన్నారు. లేనిచో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయుసీఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న, డి.రాజేశ్వర్, నాయకులు సాయరెడ్డి, గంగాధర్, విఠల్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, మహేష్ పీఓడబ్ల్యూ నాయకులు అమూల్య, మానస, పీ.డీ.ఎస్.యు నాయకులు అషూర్ నసీర్ సృజన్ తదితరులు పాల్గొన్నారు.
