. . . జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి రాజశ్రీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా స్పెషాలిటీ డాక్టర్ల తో నిర్వహించే క్యాంపులను విజయవంతం చేయాలని, స్పెషాలిటీ ఆధారంగా రోగులను నమోదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.బి.రాజశ్రీ తెలియజేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉప వైద్యాధికారులు ప్రోగ్రాం అధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఆర్ బి ఎస్ కే వైద్యులు, వైద్య సిబ్బందికి జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాజశ్రీ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ పీహెచ్ సీలను, ఆరోగ్య కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేస్తున్నారని, అందరూ సక్రమంగా విధులు నిర్వహించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది అందరూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఆరోగ్య ఉప కేంద్రాల్లో సమయపాలన పాటించాలని, వారి వారి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసేలా పీహెచ్ సీ స్థాయిలో సమీక్షలు నిర్వహించాలని తెలియజేశారు. మాతా, శిశు ఆరోగ్యాన్ని కాపాడుతూ మాతృ మరణాలు, శిశు, చిన్నపిల్లల మరణాలు జరగకుండా చూడాలని, గర్భిణీ స్త్రీలందరికీ నాలుగు విడతల్లో పరీక్షలు నిర్వహించాలని, పెండింగ్ లో ఉన్న గర్భిణీ స్త్రీల జాబితాలను సేకరించి ఫాలో అప్ చేయాలన్నారు. 30 సంవత్సరాలు పై బడిన అందరికీ ఏబిహెచ్ఏ కార్డ్ జనరేషన్ చేయాలన్నారు. అర్హులైన శిశువులందరికి 100% వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలని, పెండింగ్ లో ఉన్న శిశువుల జాబితా సేకరించి పర్యవేక్షణ చేయాలన్నారు. జీవన శైలి వ్యాధుల నియంత్రణలో మెడికల్ ఆఫీసర్ లాగిన్ లో పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్వేత, డాక్టర్ వెంకన్న, డాక్టర్ శిఖరా, డాక్టర్ శ్రావ్య, డి పిఓ విశాల, డి డి ఎం నారాయణ, పృథ్వి, డిహెచ్ఇ ఘన్ పూర్ వెంకటేశ్వర్లు, క్వాలిటీ మేనేజర్ రాము పాల్గొన్నారు.
