Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 August 2025, 2:57 pm Posted by : ramakrishna

ఎల్లారెడ్డి నియోజకవర్గానికి స్పెషల్ ప్యాకేజీ నిధులు ఇవ్వండి

  • సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ఎమ్మెల్యే మదన్ మోహన్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజకవర్గానికి స్పెషల్ ప్యాకేజీ నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే మదన్ మోహన్ కోరారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సందర్భంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శనివారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని భారీ వర్షాలు, వరదలు తాకిన విధానం, వాటి కారణంగా వచ్చిన నష్టం గురించి, ప్రస్తుత పరిస్థులు గురుంచి సీఎం కు వివరించారు. ముఖ్యంగా వరదల వల్ల రైతులకు వచ్చిన పంట నష్టం వివరించి, నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. రోడ్లు, బ్రిడ్జిలు, చెరువులు ధ్వంసమైన ప్రాంతాలకు పునర్నిర్మాణ పనుల కోసం ప్రత్యేక నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 103 సంవత్సరాల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్ట్ మరమ్మతుల కోసం తగిన నిధుల్ని మంజూరు చేయాలని అభ్యర్థించారు. నియోజకవర్గంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ధ్వంసమైన గృహాలకు ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకం ద్వారా నూతన గృహాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం వరదల వల్ల ఎదురైన పరిస్థితులపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పందిస్తుందని, అవసరమైన నిధులను త్వరితగతిన విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. వర్షాలు, వరదల పరిస్థితుల్లో ఎల్లారెడ్డి ప్రజల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, అధికారులు సహాయ బృందాలతో సమన్వయం కొనసాగించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. వరదల్లో ఇరుక్కున్న ప్రజలను సురక్షితంగా బయటకు రప్పించడంలో ఆయన పాత్ర కీలకమైందని సీఎం పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో ప్రజలతోపాటు నిలిచిన ప్రభుత్వ అధికారులను, కాంగ్రెస్ పార్టీ నాయకులను సీఎం అభినందించారు.