నిజామాబాద్, బతుకమ్మ: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పరిశుభ్ర వాతావరణంలో భోజనం తయారు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఆర్మూర్ మండలం పిప్రి సమీపంలోని ఆర్మూర్, వేల్పూర్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాళ్లను పరిశీలించారు. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించి, మెనూ ప్రకారం ఉన్నాయా అని తనిఖీ చేశారు. ఆర్మూర్ ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సరఫరా అవుతున్న సన్నబియ్యం నాణ్యతలో ఏమైనా తేడా ఉంటోందా అని మెస్ ఇంచార్జీలను ప్రశ్నించారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో అల్పాహారం, స్నాక్స్ అందించాలని సూచించారు. విజయ డెయిరీ పాలను వినియోగించాలని, రాత్రి సమయంలో ఏ.ఎన్.ఎం, వాచ్ మెన్ తో పాటు పర్యవేక్షణ కోసం ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా వసతి గృహంలోనే బస చేయాలన్నారు. నీటి సంపు, వాటర్ ట్యాంక్ లను పరిశీలించి, మిషన్ భగీరథ నీళ్లు సరఫరా అవుతున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ, రెండు గురుకులాల్లోనూ ఆర్.ఓ వాటర్ ప్లాంట్లు లేవని నిర్వాహకులు తెలుపగా, వాటిని ఏర్పాటు చేయిస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ తహసీల్దార్ గజానన్, గురుకుల పాఠశాలల నిర్వాహకులు ఉన్నారు.
