Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 September 2025, 7:27 pm Posted by : ramakrishna

శోభాయాత్ర ప్రారంభంలో ప్రోటోకాల్ రగడ

  • బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట

 

నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దశాబ్దాల చరిత్ర కలిగిన గణేష్ నిమజ్జనం శోభాయాత్రకు రాజకీయరంగు పులుముకుంది. ప్రతి ఏటా సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. సార్వజనిక్ కమిటీ కన్వీనర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించడం సాంప్రదాయంగా జరుగుతోంది. ఎమ్మెల్యేలు లేనప్పుడు జిల్లా కలెక్టర్ చేతులు మీదుగా జెండా ఊపి ప్రారంభించడం జరుగుతుంది.

గత తొమ్మిది రోజులుగా భక్తిశ్రద్ధలతో జరిగిన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా దుబ్బలో జరిగిన శోభయాత్ర ప్రారంభం రాజకీయ రగడగా మారింది. సార్వజనిక్ గణేష్ మండలి కన్వీనర్ బంటు గణేష్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జెండా ఊపి ప్రారంభించాల్సి ఉండగా వేడుకలకు ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఆయన కూడా జెండా ఊపేందుకు సిద్ధపడ్డారు. ముగ్గురు కలిసి చేయాల్సిన చోట ఒక్కరి జెండా ఊపడంతో వివాదానికి కారణమైంది.

సార్వజనిక్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా జెండా ఊపి ప్రారంభించే సాంప్రదాయంలో కాంగ్రెస్ బిజెపి శ్రేణులు జెండా కోసం పోటీపడ్డాయి. ఎమ్మెల్యే చేతుల మీదుగా జరగాల్సిన ప్రారంభ వేడుకలను ఎమ్మెల్సీ చేతుల మీదుగా జరిపి అగ్నికి ఆజ్యం పోశారు. జెండాను లాక్కుని ఊపేందుకు బిజెపి కాంగ్రెస్ శ్రేణులు పోటీ పడడంతో తోపులాట జరిగింది. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఇతర అధికారులు ఉండగానే ప్రోటోకాల్ అంటూ కొత్త వివాదానికి తీరదీశారు.