- పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : జడ్పీహెచ్ఎస్ కాలూర్ స్కూలు స్థలాన్ని కబ్జాల నుండి కాపాడాలని పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్ డిమాండ్ చేశారు. కబ్జాకు గురైన జడ్పిహెచ్ఎస్ కాలూరు స్కూలు స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) ఆధ్వర్యంలో కాలూరు జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్ ముందు విద్యార్థులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్ మాట్లాడుతూ కాలూరు హైస్కూల్ స్థలం మూడు ఎకరాల 18 గుంటలు ఉన్నదన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాటి అధికార పార్టీ నేతలు సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన స్కూలు స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారన్నారు. గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు, పీ.డీ.ఎస్.యూ పోరాటంతో కబ్జాను నివారించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ముస్కే సంతోష్ అనే వ్యక్తి పాఠశాల స్కూలు స్థలాన్ని కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణానికి పాల్పడుతున్నాడన్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ గార్లకు ఫిర్యాదు చేశామన్నారు. అందరూ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారని, కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కై, కబ్జాదారులకే వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు చెప్పినా టౌన్ ప్లానింగ్ అధికారులు వారి సూచనలను బేఖాతరు చేస్తున్నారన్నారు. సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, రూరల్ ఎమ్మెల్యేలు పాఠశాలని సందర్శించి, కబ్జాను నివారించాలన్నారు. లేనిచో ఆందోళనలను ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు నాయకులు సృజన్, నసీర్, సాయికుమార్, వినోద్, అలేఖ్య, వైష్ణవి, మనితేజ తదితరులు పాల్గొన్నారు.